స్థానిక ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దు
- బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్
డీసీసీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఆఫీసు బేరర్లతో.. మీనాక్షినటరాజన్, మహేశ్‌గౌడ్ జూమ్ మీటింగ్
హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలను తేలికగా తీసుకోవద్దని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల ఘనత కాంగ్రెస్‌దేనని, ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన సూ చించారు. ఆదివారం డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, కార్పొరేషన్ చైర్మన్లతో టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ జూమ్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మహేశ్ కుమా ర్ గౌడ్ మాట్లాడుతూ.. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్.. రాజకీయంగా బీసీలను అణగదొక్కారని ఆరోపించారు. బీసీ కులగణన చేపట్టి, పకడ్బందీగా బీసీ బిల్లు తెచ్చి.. వెనకబడిన వర్గాలకు రాజకీయ సుస్థిర స్థానం కల్పిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనని చెప్పా రు. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఆశయాలకు అనుగుణంగా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలం గాణ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.
ఆ బిల్లులు గవర్నర్, రాష్ర్టపతికి పంపి ఆలస్యమవుతుంటే కోర్టు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించమంటే ఆర్డినెన్స్ తెచ్చామని స్పష్టం చేశారు. ఆర్డినెన్స్‌ను కూడా గవ ర్నర్ ఆమోదించకపోవడంతో ఈ రోజు అసెంబ్లీలో మళ్లీ రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ, 42 శాతం బీసీ రిజర్వేషన్లు చేసి బిల్లు పాస్ చేసి చూపించామని, ఇది తమ ప్రభు త్వ చిత్తశుద్ధి అని చెప్పారు.
ఎన్ని రాజకీయ, సాంకేతిక, న్యాయపరమైన అడ్డంకులు వచ్చి నా ఎదుర్కొని నేడు బీసీల రిజర్వేషన్ల విషయంలో అన్ని చేసి చూపించామన్నారు. బీసీ రిజర్వేషన్ల హీరోగా రాహుల్ గాంధీ, ఖర్గే, రేవంత్‌రెడ్డిలను నిలబెట్టాలని.. గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఏమాత్రం సులువుగా తీసుకోవద్దని.. పూర్తిస్థాయిలో విజయం సాధించేలా కృషి చేయాలన్నారు.
రాహుల్‌గాంధీ ఆశయాలు నెరవేరుతున్నాయి..
రిజర్వేషన్ల అమలు కోసం 50 శాతం నిబంధన ఎత్తివేస్తూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మా నం చేసినందుకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్ర భుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ చర్యలను సమాజం సంపూర్ణంగా స్వాగతించాలని ఆయన ఆకాంక్షించారు. సాంకేతి క, న్యాయ,
రాజకీయ అంశాలను పరిగణనలోకి తీసుకొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తీసుకున్న ఈ చర్య పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. బిల్లుకు మద్దతు తెలిపిన ప్రతిపక్ష నాయకులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
బీసీలకు వారి వాటా ప్రకారం రాజకీయ అవకా శాలు కల్పించాలని మొదటి నుంచి ఆకాంక్షిస్తున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశయాలు తెలంగాణలో నెరవేరబోతున్నాయని, ఇది చాలా మంచి పరిణామమని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సారథ్యంలో ఈ బీసీ రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా అమలయ్యేలా తెలంగాణ నుంచి అడుగులు పడతాయని, కాంగ్రెస్ పార్టీ దీని కోసం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
గాంధీ భవన్‌లో బీసీ రిజర్వేషన్ల సంబురాలు
తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సంబురాలు చేసుకున్నారు. టీపీసీసీ పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని టీపీసీసీ నాయకులు స్వాగతించారు. సంబురాలకు పీసీసీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీశ్‌రావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు నేతృత్వం వహించారు.
ఈ సందర్భంగా సంగిశెట్టి జగదీశ్‌రావు మాట్లాడుతూ, ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ కృషిని తెలంగాణ సమాజం గుర్తించాలని కోరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రివర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జాతీయ ఓబీసీ కోఆర్డినేటర్ కేతురి వెంకటేశ్, పులి అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.






