calender_icon.png 8 May, 2025 | 7:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి చట్టం ఆధారంగా భూ సమస్యల పరిష్కారం

07-05-2025 12:00:00 AM

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి

హనుమకొండ, మే 6 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తీసుకువచ్చిన భూభారతి చట్టం ఆధారంగా భూ సమస్యలు  పరిష్కారం అవుతాయని  పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా నడికూడ మండలం సర్వాపూర్, ముస్త్యాలపల్లి  గ్రామాలలో  భూభారతి చట్టంపై రెవెన్యూ సదస్సులను  అధికారులు నిర్వహించారు.

ఈ రెవెన్యూ సదస్సులకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ భూభారతి రెవెన్యూ సదస్సుకు జిల్లాలో నడికూడ మండలాన్ని ఎంపిక చేయడం సంతోషకరమన్నారు. రెవెన్యూ సదస్సులో రైతులు అందించే విజ్ఞప్తులను పరిశీలించి పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.  స్వాతంత్య్ర  భారతదేశంలో 1954లో కాస్ర పహాణి ద్వారా భూ రికార్డులకు సంబంధించి బేస్ డాక్యుమెంట్ ఉండేదన్నారు.

2020 లో ధరణి చట్టాన్ని తీసుకువచ్చారని అన్నారు. గతంలో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేదిగా కొత్తగా తీసుకువచ్చిన ధరణి చట్టం ఉండాలి కానీ దాని ద్వారా భూ సమస్యలు ఇంకా ఎక్కువ అయ్యాయని అన్నారు. ధరణి చట్టం గ్రామాలలో భూ సమస్యలు కుటుంబాల మధ్య విభేదాలకు కారణమైందన్నారు. గతంలో భూ రికార్డులలో పట్టాదారులు ఉన్నప్పటికీ ఖాస్తు కాలమ్‌లో అనుభవదారు కాలమ్ ఉండేదన్నారు.

ధరణి అమల్లోకి వచ్చిన తర్వాత అనుభవ దారు కాలమ్ ను తీసేసారని అన్నారు. అనుభవదారు కాలమ్ తీసివేయడం పెద్ద తప్పిదమ న్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం రావడానికి రైతులు ప్రధాన భూమిక పోషించారని అన్నారు. పైలెట్‌గా ఎంపికైన నడికూడ మండలంలో రైతులు సూచించిన సమస్యలను క్రోడీకరించి ఈ నెల చివరినాటికి ఈ గ్రామాలకు సంబంధించి భూ సమస్యలను తహసిల్దార్ ఆర్డీవోలు తగిన పరిష్కారానికి చర్యలు చేపడతారని అన్నారు.

సర్వేయర్లు లేకపోవడంతో అనేక చోట్ల సర్వే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, దీనిలో భాగంగానే ప్రత్యేకంగా సర్వేయర్లను  నియమిస్తు న్నారని తెలిపారు. కలెక్టర్ స్థాయిలోనే  భూ సమస్యలు పరిష్కారం కావాలన్నారు. 1954 లో వచ్చిన కాస్రా పహాని  బేస్ గా ఉందో అదేవిధంగా భూభారతి చట్టం భూ సమస్యల నమస్కా రానికి బేస్ గా ఉండాలనేది  ప్రభుత్వ ఉద్దేశమని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు.

హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు పెట్టుకున్న రైతులకు వారి చుట్టుపక్కల ఉన్నవారికి నోటీసులు అందించి క్షేత్రస్థాయిలో విచారించి నెలాఖరు వరకు  పరిష్కారమవుతాయన్నారు. పైలెట్ మండలంలో ఉన్న నడికూడ మండలంలో 90 శాతం వరకు  భూ సమస్యలు నెలాఖరు వరకు పరిష్కారమవుతాయన్నారు. 

మిగిలిన 10 శాతం సమస్యలను కూడా పరిష్కరించేందుకు  చర్యలు చేపడతామన్నారు. సమస్యలు ఉన్న రైతులు అర్జీలను అందించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డిఓ డాక్టర్ నారాయణ, హనుమకొండ  డిప్యూటీ కలెక్టర్ మంగీలాల్, నడికూడ తహసిల్దార్  నాగరాజు, ఇతర అధికారులతో పాటు స్థానిక  రైతులు, తదితరులు పాల్గొన్నారు.