ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం: బండి రమేష్
కూకట్‌పల్లి, జులై 12 (విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిస్కారమే తన లక్ష్యమని రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ అన్నారు. కూకట్ పల్లి నియోజకవర్గం వసంత్ నగర్ డివిజన్ పరిధి డ్రీమ్ వ్యాలీ కాలనీలో బండి రమేష్ పాదయాత్ర నిర్వహించి స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు కొన్ని సంవత్సరాల నుండి డ్రైనేజ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని, అనేక ప్రాంతాలలో స్ట్రీట్ లైట్స్ లేక స్థానికులు అసౌకర్యానికి గురవుతున్నారని, కాలనీ లోని అంతర్గత రహదారులు పూర్తిగా దెబ్బతిని ప్రయాణానికి అనుకూలంగా లేవని బండి రమేష్ దృష్టికి తీసుకోవచ్చారు.
కాలనీవాసుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన బండి రమేష్ మాట్లాడుతూ కాలనీలో ప్రధాన సమస్య అయిన డ్రైనేజ్ సమస్యకు అధికారులతో మాట్లాడి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని, అవసరమైన చోట స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేపిస్తానని, దెబ్బతిన్నచోట రోడ్ల మరమ్మతులు త్వరితగతిన చేపట్టేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డ్రీమ్ వ్యాలీ కాలనీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానన్నారు.
అవసరమైతే మరోసారి పాదయాత్ర చేపట్టి పనుల పురోగతిని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చిన నేరుగా నన్ను సంప్రదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తూము వేణు, శ్రీనివాస బాబు, మాకినేని వినోద్, గాలి బాలాజీ, దినేష్ కుమార్, రంగమోహన్, చావా చౌదరి,గోపాల్ చౌదరి, శివా చౌదరి, సంధ్య, రజిత తదితరులు పాల్గొన్నారు.






