గట్రావ్‌పల్లికి బస్సు పునరుద్ధరణ
20-06-2024 12:07 AM
బెల్లంపల్లి, జూన్ 19 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని గట్రావ్‌పల్లికి బుధవారం ఆర్టీసీ అధికారులు బస్సు సర్వీసును పునరుద్ధరించారు. గతంలో కాసిపేట మండలంలోని మల్కేపల్లి, లక్ష్మీపూర్, వెంకటా పూర్, సోనాపూర్, గట్రావ్‌పల్లి వరకు బస్సును నడవగా, వివిధ కారణాలతో ఆ సర్వీసు నిలిచింది. బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ౧౦ కిలోమీటర్లు దూరంలోని దేవాపూర్ యాప వరకు కాలినడకన వచ్చి ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొన్నది. విషయాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావ్ దృష్టికి తీసుకెళ్లడంతో.. ఆయన ఆర్టీసీ అధికారులతో మాట్లాడి తిరిగి గట్రావ్‌పల్లికి బస్సును పునరుద్ధరించేలా చూశారు. దీంతో గ్రామస్తులు ఎమ్మెల్యేకు, ఆర్టీసీకి కృతజ్ఞతలు తెలిపారు.






