09-11-2025 12:35:12 AM
11వ తేదీ సాయంత్రం 6 వరకు అమలు
పోలీస్ కమిషనర్ సజ్జనార్
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 8 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు నియోజకవర్గ పరిధిలో కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఆంక్షలు అదివారం సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ ముగిసే నవంబర్ 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అమల్లో ఉంటాయన్నారు.
అనంతరం, ఓట్ల లెక్కింపు సందర్భంగా నవంబర్ 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు కూడా ఈ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రజాశాంతికి భంగం కలగకుండా చూసేందుకు, నియోజకవర్గ పరిధిలో భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 163ను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సెక్షన్ ప్రకారం, ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుంపులుగా ఏర్పడటంపై నిషేధం ఉంటుంది. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఈ నిబంధన కచ్చితంగా వర్తిస్తుందని ఆయన నొక్కిచెప్పారు. ఆంక్షలు అమల్లో ఉన్న నిర్దేశిత సమయాల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించారు.