09-12-2025 12:23:49 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్ ,డిసెంబర్8( విజయ క్రాంతి): పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ వార్డు, సభ్యుల స్థానాలకు జరుగనున్న ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్,ఆర్డిఓ లోకేశ్వర్ రావు, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి లతో కలిసి మొదటి, రెండవ విడత ఎన్నికల నిర్వహణలో భాగంగా స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ ఇచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమైనదని తెలిపారు. జిల్లాలో 3 విడతలుగా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణ పూర్తి పారదర్శకంగా జరగాలని, ఎలాంటి పొరపాట్లకు, వివాదాలకు తావు లేకుండా, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని తెలిపారు.
అధికారులు తమకు కేటాయించిన గ్రామపంచాయతీలలో ఎన్నికల కొరకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పోలింగ్ రోజున ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి మొదటిగా వార్డు సభ్యుల స్థానాలకు, అనంతరం సర్పంచ్ స్థానానికి ఓట్ల లెక్కింపు చేపట్టి, ఉప సర్పంచ్ ను ఎన్నుకోవాలని తెలిపారు.
కౌంటింగ్ ముందు పి ఓ డైరీ, బ్యాలెట్ పేపర్, అకౌంట్ పేపర్ సీల్, అకౌంట్ స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ కవర్లను పరిశీలించారని, ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ చేపట్టాలని, జోనల్ అధికారులను సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ఓట్ల లెక్కింపు సమయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని, పోలింగ్ కేంద్రంలో శాంతిభద్రతలపై పర్యవేక్షించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు ఉషన్న, ఆసిఫ్, స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.