12-09-2025 12:00:00 AM
-కాంగ్రెసోళ్లు వార్డు మెంబర్ కూడా గెలవరు
-భయపడే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టట్లేదు
-మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
చేవెళ్ల, సెప్టెంబర్ 11: సీఎం రేవంత్ రెడ్డి రైతులను గోస పెడుతున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. యూరియా కోసం రోజుల తరబడి తిప్పలు పెడుతున్నారని, ఆడబిడ్డలను గంటల తరబడి లైన్లలో నిలబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గురువారం షాబాద్ లో మాజీ జడ్పీటీసీ అవినాశ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు వానాకాలానికి ముందే సాగు విస్తీర్ణం అంచనా వేసి, యూరియా ఎంత అవసరమో ముందుగానే సిద్ధం చేసేవారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రైతులు రెండు నెలలుగా యూరియా కోసం తిప్పలు పడుతుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదని విమర్శించారు.
పైగా రైతులు చెప్పులు లైన్లలో పెట్టి పడిగాపులు కాస్తుంటే, పడేసిన చెప్పులు తీసుకొచ్చి లైన్లలో పెడుతున్నారని మంత్రులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆడబిడ్డలు బయటికి రావొద్దని ఇంటింటికీ నల్లా పెట్టిస్తే... రేవంత్ రెడ్డి మాత్రం యూరియా కోసం లైన్లలో నిలబెడుతున్నారని విమర్శించారు. మహిళలు కనిపిస్తే కోటీశ్వర్లను చేస్తా అంటున్న రేవంత్ రెడ్డి... ఎంతమందని చేశారో చెప్పాలని ప్రశ్నించారు. 24 గంటల కరెంట్, రైతుబంధు, యూరియా ఇలా ఏవీ లేకుండా చేశాడని మండిపడ్డారు.
గ్రూప్ 1పోస్టుల పేరిట రూ.1700 కోట్ల కుంభకోణం: ఆర్‌ఎస్పీ
కాంగ్రెస్ నేతలు గ్రూప్-1 పోస్టుల పేరిట రూ.1700 కోట్ల కుంభకోణానికి తెరతీశారని మాజీ ఐపీఎస్, బీఆర్‌ఎస్ సీనియర్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. తాను, దాసోజు శ్రవణ్తో కలిసి, కేటీఆర్ ఆదేశాల మేరకు టీఎస్పీఎస్సీ కార్యాల యానికి వెళితే, అక్కడ ఓ నిరుద్యోగి చెప్పిన మాటలు విని విస్తుపోయానన్నారు. ఆ నిరుద్యోగి ఒక కాంగ్రెస్ నాయకుడికి ఫోన్ చేస్తే, ట్రాన్స్ఫర్ పోస్టులకు రూ.30 లక్షలు, డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ ఎస్పీ ఉద్యోగాలకు రూ.30 లక్షలు ఏడు సరిపోదని, రూ.3 కోట్లు ఇస్తేనే ఉద్యోగం వస్తుందని చెప్పాడని ఆరోపించారు.
ఒక్కో పోస్టుకు రూ.3 కోట్లు అంటే 563 పోస్టులను రూ.1700 కోట్లకు అమ్మాలని చూశారని విమర్శించారు. రూ.200కు రావాల్సిన యూరియాను బ్లాక్ మార్కెట్లో రూ.800కు అమ్ముతున్నారని విమర్శించారు. బీజేపీ నేతలు 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా పంపిస్తే, కాంగ్రెస్ నేతలు 6 లక్షల మెట్రిక్ టన్నులని చెబుతున్నారని, వారి ఇండ్లు, గోదాముల్లో చెక్ చేస్తే యూరియా బయటపడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో సబితా ఇంద్రారెడ్డి కొడుకు పట్లోళ్ల కౌశిక్ రెడ్డి, బీఆర్‌ఎస్ మాజీ నియోజకవర్గ ఇంచార్జి దేశమోళ్ల ఆంజనేయులు, షాబాద్, చేవెళ్ల మండల అధ్యక్షులు గూడూరి నర్సింగ రావు, పెద్దోళ్ల ప్రభాకర్, మహిళా అధ్యక్షురాలు కవిత, బీఆర్‌ఎస్ యూత్ అధ్యక్షుడు వంగా శ్రీధర్ రెడ్డి, నేతలు గోనె కరుణాకర్ రెడ్డి, శేరి రాజు, దర్శన్, శ్రీరామ్ రెడ్డి, జడల లక్ష్మిరాజేందర్ గౌడ్, వెంకటయ్య, శ్రీనివాస్ గౌడ్, రాజేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, దండు సత్యం, బ్యాగరి సుదర్శన్, తెలుగు వెంకటేష్, ఎల్లన్న, ఉపేందర్, రవి కుమార్ , ఊరడి రాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.