calender_icon.png 27 December, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్‌రెడ్డి భాష వీధి రౌడీకంటే హీనం

27-12-2025 02:19:07 AM

  1. వచ్చే ఎన్నికల్లో ప్రజలు మీ తోలు తీసి డప్పు కొట్టడం ఖాయం
  2. ఇప్పటికైనా మీ బూతు భాష మార్చుకోండి
  3. ముఖ్యమంత్రికి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ

హైదరాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి) : రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి సీఎం అనే విషయాన్ని మర్చిపోయి, బాధ్యత గల పదవిలో ఉండి కూడా వీధి రౌడీల కంటే హీనంగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సంస్కారం, అభివృద్ధిని విస్మరించి అహంకారపు బూతు భాషా పాలనకు దిగజారిన వైఖరి పట్ల నిరసన తెలుపుతూ శుక్రవారం రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు మీరు నేర్పుతున్నది ‘గ్రామ స్వరాజ్యమా’? లేక మీ ‘బూతుల సామ్రాజ్యమా’? అని ప్రశ్నించారు.

ప్రజాస్వామ్య బద్ధంగా పాలమూరు రంగారెడ్డి  ఎత్తిపోతల ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయట్లేదు అని కేసీఆర్ ప్రశ్నిస్తే కనీస సంస్కారం లేని మీరు, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పిచ్చివాడిలా ఊగిపోతూ, కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులపై ప్రయోగించిన భాష అత్యం త జుగుప్సాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటీవల సర్పంచుల సభలో మీరు ఉపయోగించిన భాషనే మీ ఫ్రస్ట్రేషన్, మీ పిచ్చి పతాక స్థాయికి చేరాయి అనడానికి నిదర్శనమని మండిపడ్డారు. సర్పంచులు ప్రజా సేవకులా? లేక మీ రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి వాడుకునే కిరాయి సైన్యం అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. మీలా గా అడ్డదారులు తొక్కి, బ్లాక్ మెయిల్ చేసి పైకి వచ్చిన వారికి విదేశాల్లో ఉన్న వారు ‘చిప్పలు కడగడం’ లాగే కనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆంధ్రా అల్లుడిని ఇల్లరికం ఎందుకు తెచ్చుకున్నారు?

 కేటీఆర్ ఆంధ్రాలో చదివారని నిరంతరం అసూయతో ఏడ్చే మీరు ఆంధ్రా అల్లు డిని తెచ్చుకొని ఇల్లరికం ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. సింగరేణి సొమ్ముతో జల్సాలు చేస్తూ తాతా మనవడు ఆటలాడుకోవడం నేరం కాదా అని నిలదీశారు. గడచిన రెండేళ్లలో ఆర్‌ఆర్ టాక్స్ పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని సర్వనాశనం చేసింది నిజం కాదా?, ఎక్సుజ్ శాఖలో లిక్కర్ లైసెన్సుల పేరుతో జరిగిన కోట్లాది రూపాయల దందా నిజం కాదా?, లక్షా యాభై వేల కోట్లతో మూసీని బాగు చేస్తామనే సాకుతో హైడ్రా ద్వారా పేదల ఇళ్లు కూల్చి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి మీ ఢిల్లీ బాసులకు కప్పం కట్టడానికి వేసిన స్కెచ్ కాదా? అని ప్రశ్నించారు.

మీరు సీఎం అయ్యాక హుందాగా ఉంటారని జనం అనుకున్నారని, కానీ కొడంగల్‌లో మీ కుసంస్కా ర వికృత అరుపులు, పైశాచిక పోలికేకలతో మీలో ఉన్న పాత ‘వీధి రౌడీ’ బయటపడ్డారని స్పష్టం చేశారు. రైతు బంధు రాక, రుణమాఫీ కాక, ఆరు గ్యారంటీలు అమలు కాక రగిలిపోతున్న జనం.. వచ్చే ఎన్నికల్లో మీ తోలు తీసి డప్పు కొట్టడం ఖాయమని హెచ్చరించారు. ఇప్పటికైనా మీ బూతు భాష మార్చుకోవాలని హితవుపలికారు.