15 May, 2026 | 1:25 AM

శిథిలమైన శివాలయానికి పునర్జీవం

15-05-2026 12:09 AM
  1. రూ.4 కోట్లతో పునరుద్ధరణ పనులు 
  2. రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి 

మహబూబాబాద్, మే 14 (విజయక్రాంతి): శిథిలావస్థకు చేరుకొని కాలగర్భంలో కలుస్తున్న 12వ శతాబ్దంలో నిర్మించిన శివాలయాన్ని పునరుద్ధరించడానికి రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి చర్యలు చేపట్టారు. ‘కాలగర్భంలోకి కాకతీయుల శిల్ప సంపద!’ శీర్షికతో విజయక్రాంతి దినపత్రికలో ప్రత్యేక వార్తా కథనం ప్రచురించి ఆలయ దుస్థితిని వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో తన సొంత గ్రామానికి సమీపంలో ఉన్న కాట్రపల్లి శివాలయ పునరుద్ధరణకు వేం నరేందర్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. 

గురువారం ఆయన ఆలయాన్ని సందర్శించి, శివుని దర్శించుకున్నారు. అనంతరం గ్రామస్తులతో ఆలయ అభివృద్ధిపై సమీక్షించారు. అత్యద్భుత శిల్ప నైపుణ్యం కలిగిన శివకోటేశ్వర ఆలయం జీర్ణోద్ధరణకు రూ.4 కోట్లు ప్రభుత్వం ద్వారా మం జూరు చేయించినట్లు ప్రకటించారు.

త్వరలో పనులు చేపట్టడానికి ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలిపారు. నాటి శిల్ప సౌందర్యానికి, కళా నైపుణ్యానికి నిదర్శనమైన శివ కోటేశ్వరాలయాన్ని పునరుద్ధరించి భావితరాలకు స్ఫూ ర్తిదాయకంగా నిలిచేందుకు కృషి చేస్తానన్నారు. ఆలయ పునరుద్ధరణకు గ్రామస్తులంతా సం ఘటితంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.