25 August, 2026 | 2:58 AM

ఏసీబీకి చిక్కిన ఆర్‌ఐ, జీపీవో

25-08-2026 12:00 AM

ఆలేరు, ఆగస్టు 24 (విజయక్రాంతి): భూమి పౌతి ప్రక్రియలో సహకరించేందుకు డబ్బులు అడిగిన ఆర్‌ఐ, జీపీవోలను ఏసీబీ అధికారులు సోమవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన ఆలేరు రెవెన్యూ కార్యాలయంలో కలకలం రేపింది. నల్లగొండ రేంజ్ ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర తెలిపిన వివరాల మేరకు యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డిగూడెం గ్రామానికి చెందిన బుడిగే మహేష్ కుటుంబానికి కొలనుపాక రెవెన్యూ శివారులో 8.5 ఎకరాల భూమి ఉంది.

ఇందులో మహేష్‌కు 4.5 ఎకరాలు, ఆయనతో తన అక్కకు 2 ఎకరాలను తండ్రి బుడిగే ఉప్పలయ్య గతంలో గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశారు. కొద్ది రోజుల తర్వాత తనను కుటుంబ సభ్యులు పట్టించుకోవడం లేదని పేర్కొంటూ, గతంలో చేసిన గిఫ్ట్ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని మహేష్ తండ్రి ఉప్పలయ్య ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత మహేష్ తండ్రి మృతి చెందారు.

తండ్రి పేరుపై ఉన్న మిగిలిన భూమిని తన అక్కకు విరాసత్ చేయాలని గత వారం కింద తాసీల్దార్ ఆంజనేయులును మహేష్ సంప్రదించాడు. గతంలో మీ తండ్రి ఫిర్యాదు చేసిన వివాదం ఉందని దీనిపై ఫీల్డ్ ఎంక్వయిరీ చేయాల్సి ఉంటుందని తాసీల్దార్ సూచించాడు. దీంతో ఆర్‌ఐ వేముగంటి పూర్ణచందర్రావును మహేష్ సంప్రదించగా, జీపీఓ షేక్ అహమ్మద్ ను కలవాలని సూచించినట్లు పేర్కొన్నాడు.

జీపీఓను కలవగా రూ.10 వేలు ఖర్చవుతుందని చెప్పినట్లు మహేష్ తెలిపాడు. అనంతరం ఆర్‌ఐను కలవగా మొత్తం రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. అంత మొత్తం ఇవ్వలేనని మహేష్ చెప్పడంతో రూ.14 వేలకు ఒప్పందం కుదిరినట్లు తెలిపారు. దీంతో మహేష్, ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారి సూచనల మేరకు సోమవారం జీపీఓ షేక్ అహ్మద్ కు రూ.14 వేలు అందజేస్తుండగా దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.