కౌలస్ నాలా ప్రాజెక్టు గేటు ఎత్తివేత
510 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల
జుక్కల్, ఆగస్టు 24 (విజయ క్రాంతి) : కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టు ఒక గేటు ఎత్తివేసినట్లు ప్రాజెక్టు ఏఈ సుకుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లకు గాను 457.83 మీటర్లుగా నీరు నిల్వ ఉందన్నారు. ఇన్ ఫ్లో 890 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో ప్రధాన కాలువ ద్వారా 80 క్యూసెక్కులు, ఒక గేటు ద్వారా 510 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నామని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1.237 టీఎంసీలకు గాను ప్రస్తుతం 1.196 టీఎంసీలుగా ఉన్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో రెండు రోజులపాటు వర్ష సూచన ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాజెక్టుకు దిగువన ఉన్న గ్రామాల ప్రజలు మంజీరా పరివాహక ప్రాంతాల వద్ద జాగ్రత్తగా ఉండాలన్నారు. పశువుల కాపరులు రైతులు వాగుల వెంబడి ఉండరాదని పేర్కొన్నారు. భారీ వర్షం కురిస్తే మరిన్ని ఎక్కువగా గేట్లు వదిలే అవకాశాలున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రాజెక్టు నిండుకుండలా ఉందని అన్నారు.






