11 July, 2026 | 1:49 AM

విద్యావంతుడి వైపే రైస్ మిల్లర్లు!

11-07-2026 12:02 AM
  1. సంపత్ రెడ్డికి పెరుగుతున్న మద్దతు  
  2. రేపు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నికలు

వనపర్తి, జూలై 10 ( విజయక్రాంతి ) : వనపర్తి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నికలు రేపు ( ఆదివారం ) జరగనున్న నేపథ్యంలో అధ్యక్ష పదవి పోటీ ఉత్కంఠభరితంగా మారింది. ఈ ఎన్నికల్లో మొత్తం నలుగురు అభ్యర్థులు పోటీ  చేస్తుండగా... విద్యావంతుడు, యువ పారిశ్రామికవేత్త సంపత్ రెడ్డికే రైస్ మిల్లర్ల నుంచి విశేష మద్దతు లభిస్తున్నట్లు తెలుస్తోంది. పలువురు సీనియర్ మిల్లర్లు, పరిశ్రమకు చెందిన ప్రముఖులు, నాయకులు ఆయనకు సంఘీభావం ప్రకటించడంతో ఎన్నికల సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.

రైస్ పరిశ్రమ ప్రస్తుతం ధాన్యం కొనుగోలు, సీఎంఆర్, పెరుగుతున్న నిర్వహణ వ్యయాలు, విద్యుత్ ఛార్జీలు, బ్యాంకు రుణాల భారం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ సమస్యలను ప్రభుత్వ దృష్టికి సమర్థవంతంగా తీసుకెళ్లి పరిష్కారం సాధించాలంటే చదువుకున్న, దూరదృష్టి కలిగిన నాయకత్వం అవసరమని మిల్లర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సంపత్ రెడ్డి నాయకత్వం ఉపయోగపడుతుందనే విశ్వాసాన్ని పలువురు సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవలి రోజులుగా సంపత్ రెడ్డి నిర్వహించిన ప్రచారానికి మంచి స్పందన లభించిందని తెలుస్తోంది. వివిధ ప్రాంతాలకు చెందిన రైస్ మిల్లర్లు ఆయనను కలిసి తమ మద్దతును ప్రకటించినట్లు తెలుస్తోంది . పరిశ్రమ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, ప్రభుత్వ శాఖలతో సమన్వయం, సంఘాన్ని మరింత బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన ప్రచారంలో పేర్కొన్నట్లు సమాచారం.

రేపు జరిగే ఎన్నికల్లో అధ్యక్ష పదవిని ఎవరు దక్కించుకుంటారనే అంశంపై మిల్లర్లలో ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ పెద్దల సహకారంతో సంపత్ రెడ్డికి పెరుగుతున్న మద్దతు ఎన్నికల్లో కీలకంగా మారే అవకాశముందని రైస్ మిల్లర్ల వర్గాల్లో చర్చ జరుగుతోంది.