11-11-2025 12:07:42 AM
కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, నవంబర్ 10 ( విజయక్రాంతి ) : జిల్లాలో ఖరీఫ్ 2025-26 సీజన్ కు సంబంధించి ఇంకా ప్రారంభించని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు అన్నింటిని వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు సి ఎస్ రామకృష్ణారావుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వరి ధాన్యం కొనుగోలు అంశంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి వనపర్తి జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అన్ని జిల్లాల్లో నిర్దేశించిన వరి కొనుగోలు కేంద్రాలు అన్నింటిని వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. వరి ధాన్యానికి సంబంధించిన కొనుగోలు కేంద్రాలతో పాటు, పత్తి, మొక్కజొన్న పంటలకు సంబంధించిన కొనుగోలు కేంద్రాలను సైతం తెరిచి కొనుగోళ్ళను ప్రారంభించాలన్నారు.
పత్తి, మొక్కజొన్నకు సంబంధించి మన రాష్ట్రంలో కనీస మద్దతు ధర ప్రభుత్వం అందిస్తున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి అమ్మకం కోసం వచ్చేవారికి సరిహద్దు జిల్లాల అధికారులు అడ్డుకట్ట వేయాలని సూచించారు. సమావేశంలో డిఆర్డిఓ ఉమాదేవి, పౌరసరఫరాల శాఖ అధికారి కాశీ విశ్వనాథ్, డిఎం జగన్, ఎల్ డి ఎం శివకుమార్, డి ఎ వో ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.