calender_icon.png 14 May, 2025 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెరుగుతున్న వడదెబ్బ మృతులు

24-04-2025 02:16:35 AM

ఎండలకు అల్లాడుతున్న జనం

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. మండే ఎండలతో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతులు 44 డిగ్రీలకు చేరాయి. ఈ ఎండల ధాటికి రాష్ట్రంలో వడదెబ్బ మరణాలు సంభవిస్తున్నాయి. బుధవారం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకోరుకొండి గ్రామానికి చెందిన పోలుబోయిన రామగురువు (42) మృతిచెందాడు.

పొలం వద్ద పని చేయడానికి వెళ్లగా.. మధ్యాహ్నం భోజనం తర్వాత అస్వస్థతగా ఉండటంతో తోటి రైతులకు చెప్పి, చెట్టు కింద కూర్చున్న కొద్దిసేపటికే మృతి చెందాడు. కాగా గడిచిన కొన్ని రోజులుగా రాష్ట్రంలో అనేక చోట్ల వడదెబ్బ కారణంగా అనేక మంది మృత్యువాతపడ్డారు.

మహబూబాబాద్ జిల్లా గర్ల మండలంలో సుశీల అనే మహిళ, చిన్నగంగారం ఇనుగుర్తి మండలంలో బత్తిపట్ల ఐలయ్య, మదనతుర్తికి చెందిన బిర్రు వెంకన్న, కొత్తగూడ మండలం వేలుబెల్లికి చెందిన బాసాని మల్లమ్మ, తొర్రూరు మండలం చర్లపాలెంకు చెందిన అనుమాండ్ల ప్రేమలత మృత్యువాతపడ్డారు. సోమవారం నిర్మల్ జిల్లా కురన్నపేటకు చెందిన శంకర్, రాజు అనే వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

ఆదివారం డ్రమ్మింగ్ కార్యక్రమంలో పాల్గొన్న వీరు తీవ్రమైన ఎండదెబ్బతో మరణించారు. రాష్ట్రంలో అనేక చోట్ల వృద్ధులు ఎండతాకిడిని తట్టుకోలేక పిట్టల్లా రాలిపోతున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ తగిలితే వెంటనే 108కి కాల్ చేయాలని పేర్కొంటున్నారు.