అమెరికాలో రోడ్డు ప్రమాదం
- ఇద్దరు తెలంగాణ యువతుల దుర్మరణం
- స్నేహితులతో కలిసి కారులో విహారయాత్రకు వెళ్తుండగా లోయలో పడి దుర్మరణం
- మహబూబాబాద్ జిల్లా గార్ల, ముల్కనూర్‌లో విషాదం
- మృతులిద్దరూ చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు
మహబూబాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): అమెరికాలోని కాలిఫోర్నియా లో భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ఇద్ద రు యువతులు దుర్మరణం పాలయ్యారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రానికి చెందిన పుల్లఖండం మేఘన రాణి(25), ఇదే జిల్లా ముల్కనూర్‌కు చెందిన కడియాల భావన(24) కాలిఫోర్నియాలో ఎమ్మెస్ పూర్తి చేశారు.
ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. ఆదివారం మరికొంతమం ది స్నేహితులతో కలిసి వీరు కారులో విహారయాత్రకు వెళ్తుండగా అలామాబా హిల్స్ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు లోయలో పడి అక్కడికక్కడే దుర్మర ణం పాలయ్యారు. తమ పిల్లలు ఉన్నత విద్య పూర్తి చేసి ఉద్యోగాల్లో స్థిరపడి మంచి భవిష్యత్తుతో వస్తారని ఆశించిన తల్లిదండ్రులు.. రోడ్డు ప్రమాదంలో మరణించారని తెలిసి కన్నీరు మున్నీరవుతున్నారు.
మృతులిద్దరు కూడా చిన్నతనం నుంచి ప్రాణ స్నేహితులని, మరణంలో కూడా ఇద్దరు తోడుగా వెళ్లారంటూ వారి బుంధువులు కంటతడి పెట్టారు. రెండు కుటుంబాల్లోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. మహబూబాబాద్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత మృతుల కుటుంబాల ఇంటికి వెళ్లి పరామర్శించారు. ప్రభుత్వ స్పందించి యువతుల మృతదేహాలను స్వదేశానికి తెప్పించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.






