సీఎం గారూ మీ కాళ్లు మొక్కుతాం..
బండ్లగూడ 100 ఫీట్ల రోడ్డు పనులు చేపట్టండి..
రోడ్డు ప్రమాదాలు ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలి..
బీఆర్‌ఎస్ సీనియర్ నేత ప్రేమ్ గౌడ్
రాజేంద్రనగర్, ఆగస్టు 18 (విజయక్రాంతి): బండ్లగూడ జాగీర్లో 100 ఫీట్ల రోడ్డు పనులు చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ప్రేమ్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. “సీఎం గారు.. మీ కాళ్లు మొక్కుతాం.. రోడ్డు పనులు పూర్తి చేయండి” అంటూ సీఎం రేవంత్రెడ్డికి భావోద్వేగంగా విజ్ఞప్తి చేశారు.
సోమవారం బండ్లగూడ శిశుమందిర్ పాఠశాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ రమేష్రెడ్డి మృతి చెందగా, ఆయన కుమారుడు ఐసీయూలో చికిత్స పొందుతున్న విషయాన్ని ప్రస్తావించారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా రోడ్డు విస్తరణ పనులు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. 2024లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో బండ్లగూడ రోడ్డును 100 ఫీట్ల మేర విస్తరించేందుకు జీవో 54 ద్వారా రూ.79 కోట్లు మంజూరు చేసినట్లు ప్రేమ్గౌడ్ తెలిపారు.
అయితే ఆ నిధులను ప్రస్తుత ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించిందని ఆరోపించారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భారీ భవనాల నిర్మాణాల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తున్నప్పటికీ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం గోరంగా విఫలమైందన్నారు. బండ్లగూడ బస్స్టాప్ వద్ద ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోందని, రోడ్డు విస్తరణ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.
రోడ్డు ప్రమాదాలను ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగే ‘ప్రభుత్వ హత్యలు’గా పరిగణించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రోడ్ల విస్తరణకు రూ.6,900 కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ బండ్లగూడ జాగీర్ రోడ్డు పనులను ఎందుకు విస్మరిస్తోందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రోడ్డు పనులు వెంటనే ప్రారంభించకపోతే రాజేంద్రనగర్ నియోజకవర్గ బి అర్ ఎస్ ఇంచార్జ్ కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.






