01-11-2025 06:03:57 PM
మంచిర్యాల డిసిపి ఏ. భాస్కర్ ఐపీఎస్..
మందమర్రి (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమాలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని మంచిర్యాల డిసిపి ఎ భాస్కర్ కోరారు. పట్టణంలోని యాపల్ ఏరియాలో పోలీసు, సింగరేణి, రవాణా, మున్సిపల్, రెవెన్యూ, జాతీయ రహదారి అధికారుల సమన్వయంతో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత రెండేళ్లలో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 17 మంది రోడ్డు ప్రమాదాల ద్వారా చనిపోగా, కేవలం యాపల్, అంగడి బజార్ ఏరియాలోని జాతీయ రహదారిపైనే ఈ రెండేళ్లలో ఏడుగురు మరణించారని అయన ఆందోళన వ్యక్తం చేశారు.
రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో ప్రత్యేక అవగాహన పెంచేందుకు రహదారి భద్రత సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. ద్విచక్ర వాహన దారులు విధిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయా ణించే వారు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం (డ్రంక్ అండ్ డ్రైవ్) అత్యంత ప్రమాదకరమని, అటువంటి వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వాహనాలను అతివేగంగా నడపకుండా, రోడ్డుపై సూచించిన నియమిత వేగంతో నడపాలని, మూల మలుపుల వద్ద, పాఠశాలల వద్ద వేగాన్ని తగ్గించాలనీ, మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని, తల్లిదండ్రులు బాధ్యతగా మైనర్లకు వాహనాలను దూరంగా ఉంచాలని కోరారు.
రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలలో, ముఖ్యంగా జాతీయ రహదారులపై పోలీస్ శాఖ తరపున నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రమాదాల నివారణతో పాటు రహదారుల మరమ్మతులు, సైన్ బోర్డుల ఏర్పాటు, బ్లాక్ స్పాట్‌లను సరిదిద్దడం వంటి వాటి కోసం జాతీయ రహదారి, మున్సిపల్, రెవెన్యూ అధికారులతో కలిసి పోలీస్ శాఖ సమన్వయంతో కృషి చేస్తుందన్నారు.
ఈ సందర్భంగా స్థానికుల కోరిక మేరకు యాపల్, అంగడి బజార్ ఏరియాలో త్వరలోనే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి, పోలీస్ శాఖ తరపున కృషి చేస్తామని ఆయన బరోసా ఇచ్చారు. అనంతరం యాపల్ ఏరియాకు చెందిన రెండు రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎసిపి రవి కుమార్, సిఐ శశిధర్ రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రంజిత్, పట్టణ ఎస్ఐ రాజశేఖర్, జాతీయ రహదారి అధికారులు, మున్సిపల్, రెవెన్యూ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు భద్రత కమిటీ ఏర్పాటు:
యాపల్, అంగడి బజార్ ఏరియాలకు చెందిన కొందరిని ఎంపిక చేసి, రోడ్డు భద్రత కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.