01-11-2025 06:06:22 PM
చండూరు,(విజయక్రాంతి): నిరుపేదలకు సేవ చేయడంలో గాంధీజీ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని చండూరు మండల విద్యాధికారి ఊట్కూరి సుధాకర్ రెడ్డి అన్నారు. శనివారం చండూరు మండల కేంద్రంలోని గాంధీజీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ప్రతినెల 30 మంది నిరుపేదలకు వెయ్యి రూపాయల విలువ గల నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కోడి శ్రీనివాసులు ఈ ఫౌండేషన్ పెట్టడం చాలా సంతోషకరమని, ఎంతోమంది నిరుపేదలను ఆదుకోవడంలో ముందంజలో ఉందన్నారు. భగవంతుడు ఎవరికీ ప్రత్యక్షంగా కనపడడని, సహాయం చేసే వ్యక్తులలో నే భగవంతుడు ఉంటాడని ఆయన అన్నారు. సమాజంలో చాలామందికి డబ్బులు ఉంటాయని, దానం చేసే గుణం చాలా తక్కువమందికి ఉంటుందన్నారు.
కూతురు లేని ఒంటరిమహిళలే ఈ సరుకుల తీసుకున్న వారిలో ఎక్కువమంది కనబడుతున్నారని, ఇంత మంచి గుణం కోడి శ్రీనివాసులకు ఉండడం అభినందనీయమని అన్నారు. తల్లి గర్భం నుండి వచ్చేటప్పుడు ఏమి తీసుకురామని, మరణించినప్పుడు ఏమి తీసుకపోమని, ఆర్థికంగా ఉన్నవారు సమాజ సేవా కార్యక్రమాలు చేయడం కొంతమందికే ఉంటుందన్నారు. ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ లను, వేసవికాలంలో చలివేంద్రాలను, చనిపోయిన పేద కుటుంబాలకు ఆర్థికం సాయం చేస్తూ వస్తున్నారని ఆయన అన్నారు.