21-01-2026 08:14:28 PM
ప్రమాద నివారణ చర్యలకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి
సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి
సుల్తానాబాద్,(విజయక్రాంతి): రోడ్డు భద్రత నియమ నిబంధనలు ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి సూచించారు. బుధవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతి సంవత్సరం జనవరి మాసంలో రోడ్డు భద్రత మాస ఉత్సవాలలో భాగంగా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతం చేస్తామన్నారు.
రోడ్డు భద్రత అధికారుల సూచన మేరకు పది రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రతి రోజు ఒక్కో రీతిన ప్రమాద స్థలాలను గుర్తించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలలో కరపత్రాలు అంటించి అవగాహన పెపొందిస్తున్నామని పేర్కొన్నారు. అందులో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క పద్ధతిలో గ్రామాలలో అవగాహన కల్పించడం జరుగుతుందని స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు యువత తో కలిసి ప్రజలను చైతన్య పరుస్తామన్నారు. రోజుకో పద్ధతిలో ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ప్రతి ఒక్కరు రోడ్డు సంబంధించిన నియమాలు పాటించాలని అతివేగం తగ్గించుకోవాలని, ప్రమాద స్థలాలలో జాగ్రత్తలు పాటించాలని, ద్విచక్ర వాహనాలపై వెళుతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు విధిగా హెల్మెట్ ధరించాలని సీట్ బెల్ట్ ధరించాలి. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, అదేవిధంగా కెపాసిటీ తగ్గట్టు మాత్రమే ప్రయాణించాలని అన్నారు, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణాలు కొనసాగించాలని, ప్రయాణాలు సాగించే సమయంలో తమ కుటుంబ సభ్యుల ను మర్చిపోకుండా ప్రయాణాలు సాగించి ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ లు చంద్రకుమార్ ,అశోక్ రెడ్డి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.