8 May, 2026 | 3:55 AM

రాబిన్‌హుడ్.. ఆత్మవిశ్వాసాన్ని పెంచింది

05-03-2025 12:00 AM

హీరో నితిన్ నుంచి వస్తున్న మరో హాస్యభరిత వినోదాత్మక చిత్రం ‘రాబిన్‌హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల కథానాయిక కాగా, రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. మార్చి 28న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచారంలో జోరు పెంచింది చిత్రబృందం. ఇందులో భాగంగా రాజేంద్రప్రసాద్ మంగళవారం విలేకరులతో ప్రత్యేకంగా సమావేశమై, చిత్ర విశేషాలను పంచుకున్నారు. 

నేను -సినిమా పరిశ్రమకు వచ్చి 48 ఏళ్లు అయ్యింది. ‘రాబిన్‌హుడ్’ చేశాక నటుడిగా నామీద నాకు కాన్ఫిడెన్స్ లెవల్ పెరిగింది. ఈ మూవీ చూసిన ప్రేక్షకులకు నేను హీరోగా చేసిన ఎంటర్‌టైనింగ్ సినిమాలు, ఆనాటి రోజులు గుర్తుకు వస్తాయి. పాత్రపరంగా, నటన పరంగా ఈ సినిమా చాలా వినోదభరితంగా ఉంటుంది. దర్శకుడు వెంకీ అద్భుతంగా తీశాడు. ఈ సినిమా, నా క్యారెక్టర్ పట్ల చాలా సంతోషంగా ఉంది.

సినిమాలో నాకు, నితిన్‌కు మధ్య కెమిస్ట్రీ చాలా బాగా పండింది. ఇండియాలోనే హయ్యస్ట్ సెక్యురిటీ ఏజెన్సీ నాది. నా ఏజెన్సీలో పనిచేయడానికి హీరో వస్తాడు. ఇంతకంటే కథ చెప్పకూడదు (నవ్వుతూ). ఇందులో నా టైమింగ్ నితిన్ ఫాలో అవ్వాలి, అతని టైమింగ్ నేను ఫాలో అవ్వాలి.

పాత్రల్ని అలా తీర్చిదిద్దారు. ఇద్దరం వెన్నెల కిశోర్‌కు దొరక్కూడదు. ఇలాంటి ఎంటర్‌టైనింగ్ సినిమా చేసి చాలా కాలమైంది. రాబిన్‌హుడ్ ఆడియన్స్‌కు మంచి ఫీస్ట్. ‘-జులాయి’ దగ్గర నుంచి రూ.వంద కోట్ల దాటిన కమర్షియల్ సినిమాలు చాలా చేశాను. ‘రాబిన్‌హుడ్’తో నితిన్‌కు స్టేచర్ మారబోతోంది. 

వెంకీ కుడుముల చాలా బిగ్ డైరెక్టర్ అవుతారు. ఈమధ్య కాలంలో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ ‘రాబిన్‌హుడ్’లో చేశాను. డైరెక్టర్ వెంకీ ప్రత్యేకంగా ఈ పాత్రను నా గురించి రాసుకున్నారు. పనిని చాలా ఎంజాయ్ చేసిన సినిమా ఇది. వెంకీ, త్రివిక్రమ్ దగ్గర అసిస్టెంట్‌గా చేశారు. ఆయన లక్షణాలు అన్నీ వచ్చాయి. డైలాగ్‌లో మంచి పంచ్ ఉంటుంది. తను కథ చెప్పినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. 

జులాయి తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, నాన్నకు ప్రేమతో, శ్రీమంతుడు, ఓ బేబీ, ఎఫ్2 చిత్రాల్లో నా పాత్రలను ఎలా అయితే గుర్తుపెట్టుకున్నారో.. రాబిన్‌హుడ్ కూడా నేను గ్యారెంటీగా గుర్తుపెట్టుకునే క్యారెక్టర్ అవుతుంది. 

నటుడిగా ఈ జీవితం దేవుడు, ప్రేక్షకులు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నా. లేడీస్ టైలర్, ఏప్రిల్ ఒకటి విడుదల, మిస్టర్‌పెళ్లాం, పెళ్లిపుస్తకం, ఆ ఒక్కటీ అడక్కు.. ఇలా ప్రతి సినిమా దేనికదే భిన్నంగా ఉంటుంది. పాత్రలూ విభిన్నంగా కనిపిస్తాయి. ఒకే ఏడాది హీరోగా 12 సినిమాలు రిలీజ్ చేసిన రోజులున్నాయి. దాదాపు ఆ సినిమాలన్నీ మనం రిలేట్ చేసుకునే పాత్రలే. అందుకే ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యానని అనుకుంటాను.

నాటి ప్రధాని పీవీ నరసింహారావు దగ్గర నుంచి ఇప్పటికీ చాలా మంది ప్రేక్షకులు జీవితంలో ఒత్తిడి, నిరాశలో ఉన్నప్పుడు సరదాగా నవ్వుకోవడానికి, మనసు తేలిక అవడానికి నా సినిమాలు చూస్తుంటామని చెప్పడం ఎంతో ఆనందాన్నిస్తుంది. ఇప్పటికీ దర్శకులు నాకోసం ప్రత్యేకంగా పాత్రలు రాయడం నా అదృష్టం. రాబిన్‌హుడ్ సినిమా చూసినప్పుడు కూడా ఆ స్పెషాలిటీ మీరు ఫీలవుతారు.  

శ్రీలీల చాలా మంచి సినిమాలు చేస్తోంది. చాలా మెచ్యూర్ యాక్టర్‌గా కనిపించింది. ఆమె ప్రవర్తన నాకు చాలా నచ్చింది. సినిమాలో ఫారిన్ నుంచి వచ్చిన తనకు సెక్యురిటీ ఇచ్చే బాధ్యత మాది. చాలా సరదాగా ఉంటుంది.    

మైత్రి మూవీ మేకర్స్‌తో నాకు -శ్రీమంతుడు సినిమా నుంచి మంచి అనుబంధం ఉంది. సినిమా అంటే చాలా పాషన్ ఉన్న నిర్మాతలు. వారితో కలిసి పనిచేయడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్.  

నాకు కొత్త పాత అని ఉండవు, నిజానికి కొత్త దర్శకులు నాతో పనిచేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అందరికంటే ముందు నేనే సెట్స్‌లో తెగ అల్లరి చేస్తాను. దీంతో అందరూ చాలా సౌకర్యంగా భావిస్తారు. నాతో పనిచేయడం చాలా ఈజీ.

ఇంకా నేను కొత్త సినిమాలు -చాలా చేస్తున్నాను. ఏడు రన్నింగ్‌లో ఉన్నాయి. మొదలుపెట్టాల్సినవి ఇంకో ఐదు వరకూ ఉంటాయి.