8 May, 2026 | 4:46 AM

ఏ మాయ చేసావె జీవితాంతం గుర్తుండిపోతుంది

05-03-2025 12:00 AM

సమంత ఇండస్ట్రీకి పరిచయమై 15 ఏళ్లు. ‘ఏ మాయ చేసావె’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన సమంత వరుస చిత్రాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. స్టార్ హీరోయిన్‌గా మారేందుకు సైతం పెద్దగా సమయం పట్టలేదు. సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ నార్త్ ప్రేక్షకులకు సైతం దగ్గరైంది. తాను ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను సమంత పంచుకుంది. ముఖ్యంగా ‘ఏ మాయ చేసావె’ చిత్రంలోని ప్రతి షాట్ తనకు గుర్తుండిపోయిందని వివరించింది.

“2010లో రాహుల్ రవీంద్రన్‌తో కలిసి ‘మాస్కోయిన్ కావేరి’లో నటించా. ఈ సినిమా షూటింగ్ ఒక్కరోజే జరగడంతో నాకు పెద్దగా గుర్తు లేదు. ఆ తరువాత సినిమా ఆగిపోయింది. అప్పుడు ‘ఏ మాయ చేసావె’ మూవీ అవకాశం వచ్చింది. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం నాకు జీవితాంతం గుర్తుండి పోతుంది. కార్తీక్‌ను గేటు దగ్గర కలిసే సీన్ నా ఫస్ట్ షాట్. దర్శకుడు గౌతమ్ మీనన్‌తో కలిసి పని చేయడం అద్భుతమైన అనుభూతి. ఈ సినిమా తర్వాత అంతటి స్థాయిలో సంతృప్తినిచ్చిన సినిమాలు పెద్దగా లేవనే చెప్పాలి.

15 ఏళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో ఎత్తుపల్లాలు చూశా. జీవితంలో వేటికి మినహాయింపు లేకుండా విజయాలు, అపజయాలు, సమస్యలన్నింటినీ ఫేస్ చేశా. ప్రస్తుతం చాలా పరిణతి చెందా. వచ్చే 15 ఏళ్ల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నా. తొలినాళ్లలో నటించిన సినిమాలను చూస్తే నా నటన నాకే చెత్తగా అనిపిస్తుంది. వాటి నుంచి పాఠాలు మాత్రం నేర్చుకున్నా” అంటూ సమంత చెప్పుకొచ్చింది.