8 April, 2026 | 2:16 AM

ధాన్యం కొనుగోళ్ల నిర్వహణకు పకడ్బందీ చర్యలు

08-04-2026 12:00 AM

కలెక్టర్ బాదావత్ సంతోష్

నాగర్కర్నూల్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): జిల్లాలో రబీ సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లను రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అమరేందర్తో కలిసి సంబంధిత అధికారులు, మిల్లర్లు, కాంట్రాక్టర్లతో రబీ 2025-26 సీజన్ ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రబీ సీజన్లో సుమారు 1 లక్ష 43 వేల ఎకరాల్లో వరి పంట సాగు జరిగిందని, దాదాపు 4 లక్షల 53 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. దీనికి అనుగుణంగా డీఆర్డీఏ, ఐకేపీ, సహకార, వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్, మెప్మా తదితర శాఖలు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. 

ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం గ్రేడ్‌ఏ రకానికి క్వింటాలుకు 2,389, సాధారణ రకానికి 2,369 చెల్లించనున్నట్లు తెలిపారు. అదనంగా సన్న రకం వడ్లకు క్వింటాలుకు 500 బోనస్ అందజేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో సివిల్ సప్లై అధికారి, ఫీల్ సప్లై మేనేజర్, జిల్లా సహకార అధికారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, రైస్ మిల్లుల యాజమాన్యాలు తదితరులు పాల్గొన్నారు.