మైనారిటీల అభివృద్ధికి రూ.45 కోట్ల నిధులు
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్‌నగర్ అర్బన్, ఆగస్టు 21 : పట్టణంలో మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి కోసం సుమారు రూ.45 కోట్ల నిధులు తీసుకొచ్చామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. వీరన్నపేటలోని హజ్రత్ హతావుల్లా షరీఫ్ మున్సి దర్గా వద్ద మైనారిటీ వెల్ఫేర్ ఫండ్ నుంచి రూ.20 లక్షలతో నిర్మించిన ప్రహరీగోడను ఆయన ప్రారంభించారు. కబరస్తాన్లు, దర్గాలు, మసీదుల అభివృద్ధికి మంజూరైన పనులను దశలవారీగా పూర్తి చేస్తున్నట్లు చెప్పారు.
హైలే అద్దీస్ ఈద్గా కాంపౌండ్ వాల్ పూర్తికాగా, రహిమానియా ఈద్గా వద్ద బౌండరీ వాల్, రాక్ కటింగ్, బ్యూటిఫికేషన్ పనులు 75 శాతం పూర్తయ్యాయని తెలిపారు. జామియా మసీదు అండర్గ్రౌండ్, సెల్లార్ పనులు, మదీనా మసీదు ఎక్స్టెన్షన్ పనులు త్వరలో ప్రారంభమవుతాయని వెల్లడించారు. తన పదవీకాలంలో మంజూరైన పనులన్నీ పూర్తి చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్లు, దర్గా ప్రతినిధులు పాల్గొన్నారు.






