8 August, 2026 | 2:48 AM

గ్రామీణ రహదారులు, వంతెనల అభివృద్ధి పనులకు రూ.33.70 కోట్లు మంజూరు

08-08-2026 01:48 AM

హర్షం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్, ఆగస్టు 7 (విజయ క్రాంతి): హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త అందిం చింది. నియోజకవర్గ పరిధిలో గ్రామీణ రహదారులు, వంతెనలు, క్రాస్ డ్రైనేజ్ పనుల అభివృద్ధికి మొత్తం 33.70 కోట్ల వ్యయంతో 28 అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో సిద్ధిపేట, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల పరిధిలోని పలు గ్రామాల్లో క్రాస్ డ్రైనేజ్ పనులు, వంతెనల నిర్మాణం, రక్షణ గోడలు, లో-లెవల్ కాజ్వేలు, స్లాబ్ కల్వర్టుల నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో మొత్తం 8 పనులకు 11 కోట్లు మంజూరు చేశారు.

ఇందులో చిగురుమామిడి మండలంలో 5 పనులకు 5 కోట్లు, సైదాపూర్ మండలంలో 3 పనులకు 6 కోట్లు కేటాయించారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయిన అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారడంతో పాటు వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొనే రవాణా సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. నిధుల మంజూరు పట్ల రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సంబంధిత శాఖ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.