20-11-2025 12:00:00 AM
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 19 (విజయ క్రాంతి): జిల్లాలో ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో సికింద్రాబాద్ నుండి సిరిసిల్ల వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా తన కారుకు సైడ్ ఇవ్వలేదని తిరిగి వెనక్కి వచ్చి బస్సుకు కారు అడ్డం పెట్టాడు కారు డ్రైవర్.
అనంతరం బస్సులోకి ప్రవేశించి బస్సు డ్రైవర్ కల్లూరు బాలరాజు ను ఇష్టం వచ్చిన బూతులు తిడుతూ చేతులతో గుద్దుతూ, కాలితో తన్నాడు. అనంతరం రాయితో బస్సు ముందటి అద్దాన్ని కొట్టగా అద్దం పగులు వచ్చింది. బస్సును అక్కడే ఆపి స్థానిక పోలీసు స్టేషన్ లో డ్రైవర్ బాలరాజు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఎస్త్స్ర సిరిసిల్ల అశోక్ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
దాడిపై స్పందించిన మంత్రి పొన్నం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామం వద్ద ఆర్టీసీ డ్రైవర్ పై జరిగిన దాడిని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. విధుల్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగి పై ఉద్దేశ్య పూర్వకంగా దాడి చేయడం హేయమైన చర్య అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ తో మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్ లో మాట్లాడారు.
ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణికుల కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆర్టీసీ సోదరులపై దాడి ఉపేక్షించేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చ రించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని ఆర్టీసీ ఉ ద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ మనోధైర్యాన్ని ప్రకటించారు.