20-11-2025 11:53:09 AM
బిల్లుల గడువు విధింపుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
గడువు విధించడం.. అధికారాల విభజనను తుంగలో తొక్కడమే
న్యూఢిల్లీ: బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతికి గడువు విధింపుపై సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గడువు విధించడం అధికారాల విభజనను తుంగలో తొక్కడమేనని సుప్రీంకోర్టు తెలిపింది. బిల్లు ఆమోదం, అసెంబ్లీకి తిరిగిపంపడం, రాష్ట్రపతికి పంపటమే ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఆర్టికల్ 200 (అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలిపే అధికారం) కింద గవర్నర్ తగిన ప్రక్రియను పాటించకపోతే బిల్లులను నిలిపివేయడం సమాఖ్యవాద ప్రయోజనాలకు విరుద్ధమని ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవై నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు చెప్పింది.
బిల్లులను సుదీర్ఘకాలం పెండింగ్ లో పెట్టడం సరికాదని సీజేఐ ధర్మాసనం అభిప్రాయపడింది. పునః పరిశీలనకు పంపకుండా నిలిపివేయడం సమాఖ్యవాదాన్ని ఉల్లంఘించడమేనని జస్టిస్ సూర్యకాంత్, విక్రమ్ నాథ్, పిఎస్ నరసింహ, ఎఎస్ చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్తావించిన 13 ప్రశ్నలకు సమాధానమిస్తూ, గవర్నర్, రాష్ట్రపతి రాష్ట్ర బిల్లులకు ఆమోదం తెలిపేందుకు గడువులను నిర్ణయించవచ్చా అనే దానిపై సీజేఐ బీఆర్ గవై నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తన అభిప్రాయాన్ని వెలువరించింది.