‘హెల్త్ కేర్’ హబ్‌గా హైదరాబాద్
- భవిష్యత్తుసవాళ్లను ఎదుర్కొనేలా ఇన్నోవేషన్స్
- ముప్పును ముందే అంచనా వేసే స్థాయికి ఏఐ
- ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
- యదోశ ఆస్పత్రిలో ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఏఐ ఇన్ హెల్త్ కేర్’ ప్రారంభం
హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి) : హెల్త్ కేర్ ఇన్నోవేషన్స్‌కు ప్రధాన కేంద్రం గా హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలపాలన్నదే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా, ఆవిష్కర్తలను ప్రోత్సహించేలా అంత ర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‘ఎకో సిస్టం’ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
హైటెక్ సిటీలోని యశో ద ఆసుపత్రిలో రెండు రోజుల పాటు జరగనున్నన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఏఐ ఇన్ హెల్త్ కేర్ ప్రోగ్రా మ్‌ను ఆయన శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బా బు మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఏదో ఒక రంగానికి మాత్రమే పరిమితం కాలేదని, అన్ని రంగాలకు విస్తరించి మానవ జీవితాలపై తీవ్రప్రభావం చూపుతోందన్నారు. కేవలం వ్యాధి నిర్ధారణ దశకే పరిమితం కాకుండా.. రాబోయే ముప్పును ముందే అంచ నా వేసే స్థాయికి వైద్యరంగాన్ని చేర్చిందన్నారు.
అలాగే ప్రతి రోగికి ప్రత్యేక వ్యక్తిగత వైద్య సంరక్షణ అందించే సాధనంగా మారిందన్నారు. అయినప్పటికీ ఏఐ ఎప్పటికీ వైద్యుడికి ప్రత్యామ్నాయం కాలేదని స్పష్టం చేశారు. సాంకేతి కతకు మానవీయ విలువలను జోడించినప్పుడే సమాజానికి మేలు జరుగుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల జనాభా పెరుగుతున్న తరుణంలో క్యాన్సర్, గుండెజబ్బుల వంటి క్లిష్టమైన ఆరోగ్య సవాళ్లకు సరికొత్త పరిష్కారాలు, ఆవిష్కరణలు రావాల్సిన అవసరం ఉందన్నారు.
అందుకు హైదరాబాద్‌ను ఒక లాంచ్ ప్యాడ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పారు. అకాడెమి యా, ఇండస్ట్రీ మధ్య బలమైన అనుసంధానం ఏర్పడినప్పుడే ఏఐ హెల్త్ కేర్ ఆవిష్కరణలు సామాన్యుడికి అందుతాయన్నారు. భవిష్యత్తు సవాళ్లను ముందే ఎదుర్కొనేలా.
కొత్త ఆలోచనలను ప్రోత్సహించే ఇన్నోవేషన్ ఆధారిత వ్యూహాలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. ఆవిష్కరణలు కేవలం ల్యాబ్‌లకే పరిమి తం కాకుండా, సమాజంలో నిజమైన మార్పు ను తీసుకొచ్చేలా ఆవిష్కర్తలు, స్టార్టప్స్‌కు మార్గనిర్దేశం చేస్తున్నామన్నారు.
అందుబాటులోకి ‘వన్ బయో’
పరిశోధనలకు ఊతమిచ్చేలా దేశంలోనే తొలి ఏఐ ఆధారిత డేటా ఎక్చేంజ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించామని మంత్రి శ్రీధర్‌బా బు తెలిపారు. లైఫ్ సైన్సెస్‌లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ‘వన్ బయో’ పేరిట ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామన్నారు. స్టార్టప్స్‌కు అండగా నిలిచేందుకు ఫండ్స్ ఆఫ్ ఫండ్స్‌ను ఏర్పాటు చేశామని వివరించారు. హైదరాబాద్ వేదికగా గ్లోబల్ హెల్త్ టెక్ విప్లవంలో భాగస్వామ్యం కావాలని నిపుణులు, ఆవిష్కర్తలు, కంపెనీలు, స్టార్టప్స్‌ను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల ప్రోత్సాహం ఉంటుందని భరోసానిచ్చారు.






