09-12-2025 12:49:54 AM
గోదావరిఖని, డిసెంబర్ 08(విజయ క్రాంతి) గోదావరిఖని ఆర్టీసీ డిపో టిమ్స్ డ్రైవర్లు రోడ్డెక్కారు. హైదరాబాద్, మియాపూర్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లే బస్ డ్రైవర్లకు టికెట్ ఇష్యూయింగ్ మెషిన్ (టిమ్స్) ఇస్తూ అదనపు పని భారాన్ని మోపుతున్నారని ఆరోపిస్తూ ఉదయం గోదావరిఖని ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ డ్రైవర్ల నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా డ్యూటీలను వేయడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని నినాదాలు చేశారు.
అదనంగా పని భారం మోపడం వల్ల ఒత్తిడికి గురై అనారోగ్యాల పాలవుతున్నామని ఆందోళన చెందారు. బస్సు డ్రైవర్లకు రెండు రోజులకు సంబంధించిన విధులను తమతో ఒక్క రోజే చేయిస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు డ్రైవర్ తో పాటు కండక్టర్ ను ఇచ్చేవారని, ప్రస్తుతం ఆ విధానాన్ని తొలగించడం వల్ల మరింత ఒత్తిడి కి లోనవుతున్నామన్నామని అంటున్నారు. టీమ్స్ విధానాన్ని తొలగించి కండక్టర్ల ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమంలో పలువురు ఆర్టీసీ డ్రైవర్లు పాల్గొన్నారు.