calender_icon.png 11 December, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు వడ్లు దిగుమతి చేసుకోని మిల్లర్

09-12-2025 12:48:52 AM

  1. అయోమయంలో సైదాపూర్ రైతులు

సన్నరకాలకే మొగ్గు చూపుతున్నారని వాపోతున్న రైతులు

హుజూరాబాద్, డిసెంబర్08:(విజయ క్రాంతి) : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాలను బేఖాతరు చేస్తూ హుజురాబాద్ కు చెందిన రైస్ మిల్లు యజమాని రైతులను అయోమయానికి గురిచేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సైదాపూర్ మండలం వెన్కేపల్లి ఐకేపీ అధికారులు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన వడ్లను కలెక్టర్ ఆదేశాల మేరకు, హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామంలోని వజ్రకల్ప ఇండస్ట్రీస్ రైస్ మిల్లుకు లారీలో తరలించారు.

లారీలో 663 బస్తాలలో 265 క్వింటాళ్ల ధాన్యం ఉంది. కాగా, మిల్లులో జాగాలేదనే సాకుతో లారీలోని ధాన్యాన్ని దిగుమతి చేసుకోకపోవడంతో లారీ డ్రైవర్ 24 గంటలుగా మిల్లు ముందు ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని లారీ డ్రైవర్ అధికారులకు తెలిపినా.. ఫలితం లేకుండా పోయిందని, అధికారులు వస్తారు, యజమానితో మాట్లాడి ధాన్యం దిగుమతి చేసుకుంటారనే సమాధానం ఆదివారం నుంచి చెబుతున్నారని వాపోతున్నాడు.

దీంతో, ఇక్కడ దిగుమతి చేసుకొని, ట్రక్ షీట్ వెన్కేపల్లి ఐకేపీ సెంటర్కు పంపించి అక్కడి అధికారులు నమోదు చేస్తేనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమఅవుతాయి. ప్రస్తుతం దిగుమతి చేసుకోకపోవడం, ఎప్పుడు దిగుమతి చేస్తారో చెప్పకపోవడం, మరేదైనా మిల్లుకు పంపించాలా అనే దానిపై స్పష్టత రాకపోవడంతో ధాన్యం డబ్బులు ఎప్పుడు జవుతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఒకవేళ లారీని తిరిగి ఐకేపీ సెంటర్కు పంపిస్తే పరిస్థితి ఏంటని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సన్నరకాలకు మొగ్గు చూపుతూ.. దొడ్డు వడ్లను వెనక్కి పంపుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇటువంటి విధానాలతో రైతులకు అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.