calender_icon.png 17 November, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి కొనుగోళ్లలో పాలకులు విఫలం

17-11-2025 12:53:38 AM

-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపాటు

-పత్తి కొనుగోలుకు సీసీఐ కుంటిసాకులు చెబుతోందని ఆరోపణ

-పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

హైదరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి) : పత్తి కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ఒక ప్రకటనలో తీవ్ర విమర్శించారు. రైతుల పట్ల పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మొద్దునిద్ర నటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాపు 50 లక్షల ఎకరాల పత్తి పంట పండించిన రైతన్నలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నా రని పేర్కొన్నారు.

ఈ సంక్షోభానికి కేంద్రంలోని బీజేపీ, రాష్ర్టంలోని కాంగ్రెస్ ప్రభు త్వాలే కారణమని కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని రైతుల కష్టాలను తీర్చాలని ఆయన డి మాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు ఎంపీ లు ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.  

నిమ్మకు నీరెత్తినట్టుగా..

పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో రాష్ర్టం లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కేటీఆర్  మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి 60 సార్లు ఢిల్లీకి వెళ్లినా,రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఎవరూ కూడా తెలంగాణ పత్తి రైతుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అండగా నిలబడాల్సిన రాష్ర్ట ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు.

ప్రస్తుతం పత్తి క్వింటాల్‌కు రూ. 8,110 కనీస మద్దతు ధర ఉన్నప్పటికీ, బహిరంగ మార్కెట్‌లో రైతులు కేవలం రూ. 6,000 నుంచి రూ. 7,000 మాత్రమే దక్కడం అత్యంత కష్టంగా మారిందని తెలిపారు. మరోవైపు ఇదే సాకును చూపించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తేమ ఎక్కువగా ఉన్న పత్తి కొనుగోలును చేయకుండా కఠినంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి

పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఉద్దేశపూర్వకంగా కొర్రీలు పెడుతోందని కేటీఆర్ ఆరోపించారు. గతంలో ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు పరిమితి ఉండగా, దాన్ని ఏకంగా 7 క్వింటాళ్లకు తగ్గించడం రైతులకు మరింత ఇబ్బందిగా మారిందని తెలిపారు. జిన్నింగ్ మిల్లుల అవినీతి అంటూ కుంటి సాకులు చెబుతూ కేవలం ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తే, మిగిలిన పంటను రైతులు ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు.

కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి వలన జిన్నింగ్ మిల్లులు ఒకేసారి ప్రారంభం కాకపోవడం కూడా రైతుల విక్రయాలకు ఆటంకంగా మారిందని స్పష్టం చేశారు. రాష్ర్టంలో నెలకొన్న పత్తి కొనుగోళ్ల సంక్షోభంపై కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.