ఓటరు హక్కును కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత
ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 23 (విజయక్రాంతి):ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడైన ఓటరు తన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు అన్నారు.కాగజ్నగర్ పట్టణంలోని వినయ్ గార్డెన్స్లో నిర్వహించిన ఎస్‌ఐఆర్ , బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు అవగాహన సదస్సుకు బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, సభ్యత్వ నమోదు ఇన్చార్జ్ జగన్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తో కలసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎవరూ ఓటు హక్కును కోల్పోకుండా గ్రామాలు, వార్డుల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు హక్కు కీలకమైందని, దీనిపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయవచ్చని తెలిపారు.
గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తెలంగాణ అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్ చేసిన సేవలను ప్రజలకు వివరించాలని, పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీని మరింత శక్తివంతం చేసేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కోనేరు కృష్ణారావు,ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.






