తార్నాకలో ప్రభుత్వ నిబంధన లను ఉల్లంఘిస్తూ పుస్తకాల విక్రయాలు
ఓయూ విద్యార్థి సంఘాల నాయకుడు గద్దల అంజిబాబు
సికింద్రాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమంగా పుస్తకాలు,నోట్ బుక్స్ విక్రయిస్తున్న సెయింట్ ఆన్స్ స్కూలు (తార్నాక)పై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా డీఈఓ కి వినతి పత్రం అందజేసిన ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు హైదరాబాద్ జిల్లా మారేడ్ పల్లి మండలం పరిధిలోని తార్నాకలో ఉన్న సెయింట్ ఆన్స్ స్కూలు యాజమాన్యం అక్రమంగా గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు, విద్యాశాఖ నిబంధనలు,విద్యా హక్కు చట్టం (ఆర్ టి ఏ యాక్ట్ -2009) జీవో నెంబర్ 1 స్ఫూర్తికి విరుద్ధంగా తార్నాకలోని కేమిటీ కాలనీలో ఒక ఇంట్లో అనుమతులు లేకుండా విద్యార్థులకు పుస్తకాలు,స్టేషనరీ మరియు ఇతర విద్యా సామగ్రిని నిర్దిష్ట విక్రేతల ద్వారా వేల రూపాయలతో కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తూ అక్రమ విక్రయాలు నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలలు తమ ప్రాంగణాల్లో గానీ, తమ ఆధ్వర్యంలో గానీ పుస్తకాలు, యూనిఫాంలు, స్టేషనరీ వస్తువుల విక్రయాలు నిర్వహించరాదు. ప్రభుత్వ నిబంధన లను ఉల్లంఘిస్తూ పుస్తకాల విక్రయాలు నిర్వహిస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయాలని, పునరావృతమైతే గుర్తింపు రద్దు సహా చట్టపరమైన చర్యలు చేపట్టాలని హైదరాబాద్ జిల్లా డిఈఓ ని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. లేనియెడల అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేశారు.






