calender_icon.png 10 November, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడవ కల్లు డిపోలో..ముగ్గురు విలన్లు

10-11-2025 12:32:11 AM

-‘విలన్ల’ వికృతాలకు అడ్డా 

-కోరం లేకున్నా తీర్మానాలు 

-లెక్కలడిగితే దౌర్జన్యాలు 

-కట్టప్పల అండతోనే ఆగడాలు 

-ప్రజాస్వామికంగా సర్వసభ్య సమావేశం 

-సహకార సొసైటీ చట్టానికి పాతర 

నిజామాబాద్ నవంబర్ 9: (విజయ క్రాంతి) : నిజామాబాద్ నగరంలోని భవాని కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం (మూడవ కల్లు డిపో). పేరుకు సహకార సంఘమే అయినా, ఇది ‘మహిష్మతి’ రాజ్యాన్ని తలపిస్తోంది. ఇక్కడ సభ్యుల మాటకు విలువ లేదు, కార్మికులకు న్యాయం జరగదు. ఎందుకంటే, ఈ రాజ్యాన్ని ముగ్గురు ‘విలన్లు’ ఏలుతున్నారు. వారు చెప్పిందే వేదం... వారు చేసేదే చట్టం. లాభాలు, రాజభోగాలు వారికే... తిప్పలు, కష్టాలు మాత్రం సొసైటీ సభ్యులైన గీత కార్మికులవి. ఈ అక్రమాల రాజ్యానికి నిలువెత్తు సాక్ష్యంగా ఆదివారం (2025నవంబర్ 9) నగరంలోని సందీప్ గార్డెన్’లో జరిగిన సర్వసభ్య సమావేశం నిలిచింది.

కోరం లేదు... కానీ తీర్మానం జరగాల్సిందే! 

గతంలో డైరెక్టర్ల మధ్య గొడవలు, పోలీస్ కేసుల వరకు వెళ్లడంతో ఈ డిపోను అధికారులు సీజ్ చేశారు. ఇప్పుడు, దానిని తిరిగి తెరిపించేందుకు రంగం సిద్ధమైంది. కొందరు ఎక్సుజ్ అధికారుల “మార్గనిర్దేశం” మేరకే ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. సొసైటీలో 55 మంది సభ్యులు ఉండగా, ఈ సమావేశానికి హాజరైంది కేవలం 19 మంది. 8 మంది డైరెక్టర్లకు (ఒకరు రాజీనామా చేయగా) కేవలం నలుగురు మాత్రమే హాజరయ్యారు. సహకార చట్టం ప్రకారం కనీస ‘కోరం’ లేని ఈ సమావేశం చెల్లదు. కానీ, ఆ ‘విలన్లకు’ చట్టాలతో పనేముంది? సమావేశానికి ఒక్క రోజు ముందు, అదీ ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చి హడావుడిగా దీన్ని ఏర్పాటు చేశారు. సమావేశం మొదలవగానే, హాజరైన ఇద్దరు డైరెక్టర్లు, మెజారిటీ కార్మికులు నిలదీశారు. “మాకు రావలసిన వేతన బకాయిల సంగతేంటి? సొసైటీ లెక్కలు ఎక్కడ? అవి తేల్చాకే డిపో తెరిచే అంశంపై చర్చించాలి” అని పట్టుబట్టారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ఆ ముగ్గురు పెడచెవిన పెట్టారు. “మీ బకాయిల సంగతి తర్వాత మాట్లాడదాం. మేం కదా యజమానులం, మేము చెప్పిందే వేదం. దొడ్డి దారిలో రాసుకున్న ఈ తీర్మానంపై సంతకం పెట్టాల్సిందే” అంటూ దౌర్జన్యానికి, బెదిరింపులకు పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

’మేడమ్’ చూసుకుంటారు.. మీరు సంతకం పెట్టండి 

సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా, “కోరం లేకపోతే ఏంటి? నేను ఎక్సుజ్ సీఐతో మాట్లాడాను. అన్నీ ఆమే చూసుకుంటుంది. మీరు తీర్మానం రాయండి” అని డిపోకు పెద్దమనిషిగా చలామణి అవుతున్న వ్యక్తి హుంకరించినట్లు సమాచారం. ప్రస్తుతం, రాని సభ్యులకు ఫోన్లు చేస్తూ, బెదిరిస్తూ సంతకాల కోసం తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.

అక్రమాల పునాదులపై ‘కుటుంబ’ పాలన: సొసైటీలో కోట్లు కొల్లగొడుతున్న ఒకే కుటుంబం  ఈ డిపో వ్యవహారం ఆది నుంచి అక్రమాల పునాదుల మీదే నడుస్తోందన్నది బహిరంగ రహస్యం. ఇవే దానికి నిదర్శనాలు. కుటుంబ పాలన: ఓ అన్న, తమ్ముడు, కొడుకు మాదిరిగా ఒకే కుటుంబం చేతిలో డిపో బందీ అయ్యింది. అక్రమ సభ్యత్వాలు: అసలు సంబంధం లేని ‘నాన్-లోకల్’ వ్యక్తులకు సభ్యత్వం కట్టబెట్టారు. ఖర్చుల దందా: ప్రైవేట్ సెక్యూరిటీ, సొంత వాహనాలు, వ్యక్తిగత తిరుగుళ్ల ఖర్చులన్నీ డిపో లెక్కల్లోనే రాస్తున్నారు. ఓ పెద్దమనిషి ఏకంగా ఒక నెలకు రూ. 2 లక్షలు ఖర్చు చూపించారంటే దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 

తప్పుడు లెక్కలు: తప్పుడు తీర్మానాలు, అక్రమ ఆడిట్ రిపోర్టులతో ఏళ్ల తరబడి ఐటీ, కార్మిక శాఖల కళ్లుగప్పుతున్నారు.

లైసెన్స్ గాలికి: లైసెన్స్ రెన్యువల్ కాకపోయినా అధికారులు చూసీ చూడనట్లు వదిలేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

అధికారుల్లో ‘కట్టప్ప’లు ఎవరు? 

ఈ ‘బల్లాలదేవుల’ అక్రమాలకు అండగా నిలుస్తూ, కొందరు అధికారులు ‘కట్టప్ప’లుగా మారారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

 “మేడమ్, ఎవరికీ లేని రూల్స్ మాకెందుకు విధిస్తున్నారు? మా సొసైటీని వెంటనే ఓపెన్ చేయకపోతే బాగుండదు” అని ఇదే కుటుంబానికి చెందిన వ్యక్తి స్వయంగా ఎక్సుజ్ ఎసెఓ కార్యాలయంలోనే ఆమెను బెదిరించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

గత నెల 22న ఎసెఓ నిర్వహించిన రైడ్‌లో పట్టుకొచ్చిన శాంపిల్స్‌ను సైతం బెదిరించి, కార్యాలయం నుండి లాక్కొచ్చామని ఆ పెద్దమనిషి కుమారుడే బహిరంగంగా చెప్పడం... అధికారులపై వారికున్న పట్టుకు నిదర్శనం. అలాగే సహకార చట్టం ప్రకారం అధ్యక్షుడు రాజీనామా చేస్తే, ఉపాధ్యక్షుడికి బాధ్యతలు అప్పగించాలి. లేదంటే, అధికారుల సమక్షంలో ఎన్నిక జరగాలి. ఇక్కడ ఆ నిబంధనలేవీ వర్తించవు. “మీరు ఈ విధంగా చేసుకొని రండి, మేం ఫైల్ క్లియర్ చేస్తాం” అని అధికారులే ‘క్విడ్ ప్రో కో’కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

జిల్లా మేజిస్ట్రేట్ ... ఇకనైనా స్పందించేనా? 

ఇప్పుడు అందరి చూపూ జిల్లా యంత్రాంగంపైనే ఉంది. కోట్లాది రూపాయల గీత కార్మికుల సొమ్మును దోచుకుంటున్న ఈ ‘కుటుంబం’... కోరం లేకపోయినా, దౌర్జన్యంగా సృష్టించిన ఈ తీర్మానాన్ని అధికారుల ముందు ఉంచనుంది. ఆ ఎక్సుజ్ ఉన్నతాధికారులు ఆ అక్రమ తీర్మానానికి వత్తాసు పలుకుతారా? లేక, చట్ట ప్రకారం నడుచుకొని, కార్మికులకు రావలసిన కోట్లాది రూపాయల బకాయిలను ఇప్పించి, వారి పక్షాన నిలబడతారా? అనేది ఆసక్తికరం. ఇంత జరుగుతున్నా, జిల్లా మెజిస్ట్రేట్ గారు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ అక్రమాల ‘మహిష్మతి’పై దృష్టి సారించి, గీత కార్మికులకు న్యాయం చేస్తారా? లేదా? అన్నది వేచి చూడాలి.