25 August, 2026 | 2:55 AM

‘సారంపల్లి’ కన్నుమూత

25-08-2026 12:00 AM
  1. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస
  2. సాగునీరు, వ్యవసాయ రంగ నిపుణుడిగా సారంపల్లికి గుర్తింపు

మహబూబాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): రైతు పక్షపాతి, సీపీఎం రాష్ట్ర నేత, జాతీయ కిసాన్ సభ మాజీ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి (88) హైదరాబాద్‌లో అనారోగ్యంతో కన్నుమూశారు. మల్లారెడ్డి గత కొద్దిరోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన మల్లారెడ్డి చిన్నతనం నుంచే వామపక్ష భావజాలంతో ప్రజల పక్షాన నిలిచాడు.

విద్యార్థి దశ నుంచే ఆయన అనేక సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడారు. 1973 నుంచి సిపిఎం పార్టీ ఫుల్ టైం కార్యకర్తగా పనిచేస్తూ, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక పదవులు నిర్వహించారు. నర్సంపేట రైతు సంఘం కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి, 1981లో ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శిగా, 1999లో రాష్ట్ర అధ్యక్షుడిగా, 2003లో ఆల్ ఇండియా కిసాన్ సభ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.

రైతు సంఘం నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మల్లారెడ్డి రైతు సమస్యలపై ముందుండి పోరాడారు. వ్యవసాయ రంగ సంక్షేమం నుండి బయటపడడానికి, రైతుల్లో చైతన్యం తేవడానికి అనేక పుస్తకాలను రచించారు.ఆరు దశాబ్దాల పాటు ప్రజా ఉద్యమాలను నిర్వహించిన మల్లారెడ్డి మరణ వార్త సీపీఎం పార్టీతో పాటు రైతాంగానికి తీరని లోటుగా పేర్కొంటున్నారు.

మంగళవారం మల్లారెడ్డి పార్థివ దేహాన్ని హైదరాబాదులోని ముగ్దుంభవన్ లో ప్రజల సందర్శనార్థం ఉంచి అనంతరం ఆయన కోరిక మేరకు మల్లారెడ్డి పార్దివ దేహాన్ని వైద్య విద్యార్థుల ప్రయోగ విద్య కోసం గాంధీ ఆసుపత్రికి అందించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.సారంపల్లి మల్లారెడ్డి మృతి పట్ల మంత్రి సీతక్క సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రైతులు, వ్యవసాయ కార్మికులు, పేదల హక్కుల కోసం దశాబ్దాలుగా ఆయన సాగించిన పోరాటం, రైతాంగ ఉద్యమానికి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాలకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. సారంపల్లి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమానికి తీరని లోటని మంత్రి సీతక్క పేర్కొన్నారు. సారంపల్లికి మృతికి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు సంతాపం తెలిపారు.