25 August, 2026 | 1:41 AM

ఏసీబీ వలలో వాణిజ్య శాఖ అధికారులు

25-08-2026 12:00 AM
  1. రూ.50 వేలు డిమాండ్ చేసిన ఎస్‌టీవో, సీనియర్ అసిస్టెంట్   
  2. నిర్మల్ జిల్లాలో ఘటన

నిర్మల్/ఆగస్టు 24 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని వాణిజ్య శాఖ పన్నుల కార్యాలయంలో రూ.50 వేల లంచం తీసుకుంటూ సోమవారం ఇద్దరు అధికారులు ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల మేరకు నిర్మల్ పట్టణంలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఎస్‌టీవో  గోదావరి, సీనియర్ అసిస్టెంట్ సాయి కృష్ణ సోమవారం బాధితుల నుంచి 50 వేలు లంచం తీసుకొంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు తెలిపారు.

మంచిర్యాల పట్టణానికి చెందిన ఓ వ్యాపారి శ్రీ లక్ష్మీ ప్రసన్న జ్యువెలర్స్‌కు సంబంధించిన 2022 24 ఆర్థిక సంవత్సరాల రికార్డుల ఆడిట్‌లో అనుకూలమైన నివేదిక ఇచ్చేందుకు అధికారులు తొలుత లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. చివరకు రూ.50 వేలకు ఒప్పందం కుదిరింది.

లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఎస్టీఓ గోదావరి, సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయికృష్ణ వ్యాపారి నుండి రూ.50 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరినీ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.