23 April, 2026 | 11:21 PM

భయాలకు గుడ్‌బై ఇలా!

11-03-2025 12:00 AM

విద్యార్థులకు పరీక్షలు అనగానే ఆందోళన చెందడం సహజం. చాలామంది అనవసర మానసిక ఒత్తిడికి, ఆందోళనకు గురవుతుంటారు. ఇప్పుడు పిల్లలకు పరీక్షల సీజన్ నడుస్తోంది. పరీక్షలు అనగానే కొందరు భోజనాలు మాని వేయడం, నిద్ర లేకుండా రేయింబవళ్ళు కష్టపడుతూ చదువుతుంటారు.

దీనివల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. పలువురు జ్వరం బారిన పడడమూ జరుగుతుంది. కొంతమంది విద్యార్థులకు నీరసంగా ఉండటం మరి కొందరు విద్యార్థులకు తల తిరగడం, వాంతులు కావడం చూస్తుంటాం. 

మానసిక శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు, డాక్టర్లు విద్యార్థులకు పరీక్షల సమయంలో కనీసం 6 నుండి 7 గంట ల వరకు నిద్ర అవసరమని అంటున్నా రు. ఎంత ప్రతిభ కలిగిన విద్యార్థులైనా నిద్ర లేమివల్ల చదివింది మరచిపోవడం, జ్ఞాపకం రాక సమయం వృథా కావడం జరుగుతుంది. కొందరు పరీక్ష హాల్‌లోనే ఆవులింతలు తీస్తూ కునికిపాట్లు పడడమూ జరుగుతుంటాయి. ముఖ్యంగా పిల్లలకు పరీక్షల సమయంలో అయినా కంటినిండా నిద్ర, కడుపు నిండా భోజనం తప్పనిసరి.

ఇన్విజిలేటర్ పేపర్ ఇవ్వగానే గబగబా రాయకుండా మొత్తం ఒకసారి ప్రశాంతంగా చదవాలి. ప్రశ్నపత్రం చేతికి రాగానే ముందు బాగా వచ్చిన ప్రశ్నలను టిక్కు పెట్టుకోవాలి. తర్వాత మిగిలిన ప్రశ్నలు రాయాలి. ఈ విధంగా ప్రశ్నాపత్రం పూర్తి చేయాలి. 20 మార్కుల కోసం ముగింపుకు అర్ధగంట ముందు ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో కూడిన ప్రశ్నపత్రం ఇస్తారు. ఆబ్జెక్టివ్ ప్రశ్నపత్రం ఇవ్వగానే మెయిన్ పేపర్‌కు కట్టి రాయాలి.

చివరి నిమిషంలో ఆబ్జెక్టివ్ ప్రశ్నపత్రాన్ని కట్టక పోవడం వల్ల కంగారు ఎక్కువవుతుంది. అసలు పేపర్లు కిందికి, మీదకు అవుతాయి. తల్లిదండ్రులు విద్యార్థులకు మార్కులు, ర్యాంకు లు అంటూ మానసిక ఒత్తిడికి గురి చేయరాదు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను వేరే పిల్లలతో పోల్చడం కూడా సరికాదు. విద్యార్థులలో ఆత్మన్యూనతా భావం కలుగుతుంది. చివరి నిమిషం వరకూ చదవడం శ్రేయస్కరం కాదు కూడా.

చిన్న విషయాలు  పెద్ద ప్రయోజనాలు

ఇంకా కొందరు విద్యార్థులు బస్సులు, ఆటోలు, ద్విచక్రవాహనాలపైన వెళ్తూ కూడా చదువుతుంటా రు. పరీక్ష హాల్‌లోకి వెళ్లే నిమిషం ముందు వరకూ అలా చదువుతూనే ఉండడం ఆరోగ్యానికి అంత మంచిదికాదు. పరీక్షకు వెళ్ళే అర్ధగంట ముందు చదవడం పూర్తిగా ఆపి వేసి ప్రశాంతంగా ఉండాలి. పరీక్ష సమయం కంటే అర్ధగంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవడం మంచిది. కేంద్రంలో పూర్తి ప్రశాంతతతో ఉండా లి. ప్రశ్న తీరునుబట్టి జవాబులు రాయాలి.

మార్కులకు తగినట్లు సమాధానం ఉండాలి. కేవలం ఒకే ప్రశ్నను పట్టుకొని ఎక్కువ సమయం వృథా చేయకూడదు. విద్యార్థులు ఎక్కువగా చేసే తప్పు ఏమిటంటే ప్రశ్నలను సరిగ్గా చదవ కపోవడం, చదివినా అర్థం చేసుకోవడంలో తొందరపాటు, ఆతృత వల్ల తెలిసిన విషయాలను కూడా తప్పు గా జవాబులు రాసే అవకాశం వంటివి ఉంటాయి. చిన్న ప్రశ్నలకు చిన్నగా, వ్యాసరూప ప్రశ్నలకు పెద్దగా జవాబులు రాయాలి.

తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో వ్యాకరణం, ఉత్తరాలు రాసే విధా నం తెలుసుకోవాలి. గణితంలో చాలామంది బెంబేలెత్తి పోతారు. ప్రణాళిక ప్రకారం ప్రతి రోజు ఐదు, ఆరు చిన్న లెక్కలు, ఐదు, ఆరు పెద్ద లెక్కలను చేస్తుంటే, పరీక్షల సమయంలో చాలావరకు ఒత్తిడి తగ్గుతుంది. భౌతిక, రసాయన, బయోలజీ సబ్జెక్ట్‌లలో ఎక్కువగా ఫార్ములాలు, ఈక్వేషన్స్, డయాగ్రామ్స్, రియాక్షన్స్ వంటివాటిపై ప్రత్యేకం గా నోట్స్ రాసుకోవాలి.

సాంఘికశాస్త్రంలో భారతదేశం, ప్రపంచం పటాలను, తేదీలు, సంఘటనలు, సమకాలీన అంశాలతో ముడిపెట్టి చదవడం, కథల మాదిరిగా మనసులో ప్రతిష్ఠించుకోవడం చేయాలి. కష్టపడి చదవడం ఎంత ముఖ్య మో ఇష్టపడి చదివడమూ అంతే తప్పనిసరి తెలుసుకోవాలి. సబ్జెక్టు, అంశం మనకిష్టం ఉన్నా లేకున్నా, పరీక్షలకోసమైనా ఈ పద్ధతి పాటించక తప్పదు. అప్పుడే ఆశించిన మేర ఫలితాన్ని సాధించగలరు.

పేపర్ ఇవ్వగానే మొదలు హాల్‌టికెట్ నెంబరు వేయండి. కొట్టివేతలు, రాసిన దానిమీద తిరిగి రాయడం, దిద్దడం లాంటివి చేయకండి. ప్రిపరేషన్ సమయంలో ఇంట్లో సెల్‌ఫోన్ వాడటం, వాట్సాప్, ట్విట్టర్, ఇంటర్నెట్, సినిమాలు, స్నాప్‌షాట్‌లని సమయం వృథా చేసుకోకుండా, పూర్తిగా చదువుపై దృష్టి పెట్టడం అవసరం. ఏది ఏమైనా, మన కోసం పరీక్షలు కానీ, పరీక్షల కోసం మనం కాదు అన్న సంగతి మరవరాదు.

 డా.ఎస్.విజయభాస్కర్