పాఠశాల విద్యపై శీతకన్ను
- రెగ్యులర్ డీఈవోలు లేక పర్యవేక్షణ అస్తవ్యస్తం
- మూడు జిల్లాల్లోనే రెగ్యులర్ డీఈవోలు.. మిగతా చోట్లా ఇన్‌చార్జీలే
- 21 జిల్లాలకు డీఈవో పోస్టులే మంజూరు చేయలే
- ఎంఈవో పోస్టుల్లోనూ ఇదే పరిస్థితి
- 632 మండలాలకు 15 మంది రెగ్యులర్ ఎంఈవోలు
హైదరాబాద్, జూలై 1: (విజయక్రాంతి): పాఠశాల విద్యలో రెగ్యులర్ డీఈవోలు లేక పర్యవేక్షణ కొరవడింది. చాలా వరకు జిల్లా విద్యాధికారులు, మండల విద్యాధికారుల పోస్టులను ఇన్‌చార్జ్‌లతోనే సాగిస్తున్నారు. 2016లో తొలుత 22 జిల్లాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మరికొన్ని జిల్లాలు పెంచి మొత్తం 33కు చేర్చారు. కొత్త జిల్లాలు ఏర్పా టై తొమ్మిదేండ్లు అవుతున్నా ఇంతవరకూ ఆ జిల్లాలకు డీఈవో పోస్టులే లేవు.
అంతా ఇన్‌చార్జ్‌ల పాలన కొనసాగుతోంది. దీంతో టీచర్లు, పాఠశాలలు, పరిపాలనపై పర్యవేక్షణ కొరవడుతోంది. ఆయా పోస్టుల్లో అధికారు లు అదనపు బాధ్యతల్లో ఉండటంతో రెండు పోస్టులకు తగిన సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. ఈ పోస్టుల మంజూరుకు సం బంధించి ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయం తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
అంతా ఇన్‌చార్జ్‌లే..
అటు డీఈవో.. ఇటు ఎంఈవో పోస్టులను ఇన్‌చార్జ్‌లతోనే నెట్టుకొస్తున్నారు. ఉమ్మడి పది జిల్లాలతో పాటు ఐటీడీఏ ఏజెన్సీ ప్రాంతాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాలకు మాత్రమే డీఈవో పోస్టు లున్నాయి. ఈ 12 పోస్టుల్లోనూ హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకే రెగ్యులర్ డీఈవోలు ఉన్నారు.
మిగిలిన జిల్లాల్లో ఇన్‌చార్జ్ డీఈవోలే ఉన్నారు. వీటితోపాటు అసలు పోస్టులే మంజూరు కాని మిగిలిన 21 కొత్త జిల్లాలకు పోస్టుల్లేకపోవడంతో అక్కడ ఇన్‌చార్జ్‌లే కొనసాగుతున్నారు. ఇందులోనూ కొందరికి అదనంగా మరో జిల్లాల బాధ్యతలు అప్పగించడం గమనార్హం. జిల్లా విద్యాధికారి కార్యాల యంలో పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ), డిప్యూటీ ఈవోలు, డైట్ లెక్చరర్లకు ఇన్‌చార్జ్ డీఈవోలుగా బాధ్యతలు అప్పగిస్తున్నారు.
ఇక మండలస్థాయిలో పర్యవేక్షణ అధికారిగా ఉండే మండల విద్యాధికారి (ఎంఈవో) పోస్టుల్లోనూ ఇదే తంతు ఉంది. మొత్తం 632 మండలాలుండగా, వీటిలో దాదాపు 15 మండలాలకు మాత్రమే రెగ్యులర్ ఎంఈవోలున్నారు. మిగతా మండలాలన్నిం టిలోనూ సీనియర్ హెడ్‌మాస్టర్లే ఇన్‌చార్జ్ ఎంఈవోలుగా కొనసాగుతున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
గత ప్రభుత్వ హయాంలో ఒక్కో మండలానికి ఒక ఎంఈవో కూడా ఉండేది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్కో మండలానికో ఎంఈవో ఉండేలా అదనపు బాధ్యతలను అప్పగించింది. ఇలా జిల్లాలు, మండలాల్లో పనిచేసే ఏడీలు, డైట్ లెక్చరర్లు, హెచ్‌ఎంలకు అదనపు బాధ్యతలు అప్పగిస్తుం డటంతో పరిపాలన, పర్యవేక్షణ కుంటుపడుతోంది.
ఇన్‌చార్జ్ డీఈవోకులకు పలు అంశాలపై అవగాహన ఉండటం లేదు. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు తర్వాత అన్ని విభాగాలకు పరిపాలన అధికారులు, సిబ్బందిని కేటాయించిన ప్రభుత్వం విద్యాశాఖను నిర్లక్ష్యం చేస్తుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు.
కొత్త పోస్టులు మంజూరు చేయాలి
డీఈవో, ఎంఈవో పోస్టులను మంజూరు చేయకపోవడంతో విద్యశాఖ పర్యవేక్షన కొరవడింది. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులను ఇచ్చినట్టే జిల్లా విద్యాధికారులనూ ఇవ్వాలి. ప్రస్తుతం ముగ్గురే రెగ్యులర్ డీఈవోలో పని చేస్తున్నారు. మిగతా అన్ని చోట్ల ఇన్‌చార్జీలే ఉన్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టిసారించాలి.
రమేశ్, టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
పాలన అస్తవ్యస్తం
ఆర్టికల్ 309 ప్రకారం ప్రభుత్వం, లోకల్ క్యాడర్ పోస్టులైన ఎంఈవో పోస్టులకు జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయులకు అదనపు బాధ్యతలు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. ఖాళీగా ఉన్న ఎంఈవో పోస్టులకు ప్రభుత్వ స్కూల్ అసిస్టెంట్లకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించాలి. కొత్త పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయకుంటే పాలన అస్తవ్యస్థంగా మారుతోంది.
ఎం వీరాచారి, ఎల్‌జీటీఏ సంఘం అధ్యక్షుడు
తూతూమంత్రంగా పర్యవేక్షణ
క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లోపం చాలా ఉంది. ఉన్నవారికే అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇప్పటికే పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లతో బడులను తనిఖీ చేయిస్తున్నారు. తూతూమంత్రంగా బాధ్యతలు అప్పగిస్తామంటే విద్యాశాఖ బలోపేతం కాదు. డీఈవో, ఎంఈవో పోస్టులను మంజూరు చేసి అధికారులతో పర్యవేక్షణ చేయిస్తే విద్యావ్యవస్థ బాగుపడుతోంది.
నవాత్ సురేష్, తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి






