03-12-2025 12:00:00 AM
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ టౌన్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. హనుమ కొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో పట్టణ పరిధిలోని బోడగుట్ట, సోమి డి, వడ్డేపల్లి, లష్కర్ సింగారం, పెద్దమ్మ గడ్డ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, హసన్ పర్తి, కడిపికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సిబ్బందితో ఆరో గ్య కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
జిల్లాలో 1,98,000 ప్రభావిత గ్రూపులకు చెందిన వారిని పరీక్షించి అవసరమైన పరీక్షలు నిర్వహించవలసి ఉండగా 1,30,049 మందికి స్క్రీనింగ్ నిర్వహించడం జరిగింది. స్క్రీనింగ్ తక్కువగా నిర్వహించిన వడ్డేపల్లి, లష్కర్ సింగారం, కడిపికొండ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులను ఇందుకు గల కారణాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ దేశంలో టీబీ నిర్మూలన లక్ష్యంగా ఈ కార్యక్రమం టీబీ ముక్త్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
జిల్లాలో టీబీ నియంత్రణ కార్యక్రమాలకు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దానికి అనుగుణంగా స్క్రీనింగ్, ఎక్స్ రే, నాట్ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అందించిన మొబైల్ ఎక్స్ రే మిషన్ ను పరిశీలించి ప్రణాళిక ప్రకారం ఎక్కడైతే ఎక్స్ రే పరీక్షలు తక్కువగా నిర్వహించారో అక్కడి ప్రజలకు అవగాహన కల్పించి ఎక్స్ రే పరీక్షలు నిర్వహించాలన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో స్క్రీనింగ్ బాగానే చేస్తున్నప్పటికీ పట్టణ పరిధిలో మాత్రం చాలా తక్కువగా ఉందని అన్నారు. పట్టణ ప్రాంతాలలో కూడా స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహించాలని సూచించారు. వైద్యాధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న సిబ్బంది, వనరులతో టిబి ముక్త్ భారత్ ,ఎన్సిడి, మాతా శిశు సంక్షేమంతో పాటు ఇతర అన్ని ఆరోగ్య కార్యక్రమాలు లక్ష్యాలను సాధించాలని, లేనట్లయితే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ టీబీ ముక్త్ భారత్, గర్భిణీ స్త్రీల నమోదు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య తక్కువగా ఉన్న ఆరోగ్య కేంద్రాల ఏఎన్‌ఎంలు, ఆశాలవారీగా సమీక్షించి కారణాలను తెలుసుకొని వాటిని అధిగమించి లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు.100 శాతం ప్రసవాలను ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరగడానికి ప్రోత్సహించిన ఆరుగురు ఆశాలను శాలువాలతో సత్కరించారు.
ఈ సమావేశంలో అడిషనల్ డిఎంహెచ్వో డాక్టర్ మదన్ మోహన్ రావు, టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ హిమబిందు, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ ప్రదీప్ రెడ్డి, పీవోడిటి డాక్టర్ ప్రభుదాస్, డాక్టర్ జ్ఞానేశ్వర్, డెమో వి అశోక్ రెడ్డి, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.