జూన్ 2 నుంచి రెండో విడత
- ఆదిలాబాద్ నుంచి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రారంభం
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి
- అధికారులు, ప్రజాప్రనిధులతో సమీక్ష సమావేశం
హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): జూన్ 2 నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరును ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రారంభిస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. పేద కుటుంబానికి సొంత ఇల్లు అనేది కేవలం నివాసం మాత్రమే కాదని, అది వారి ఆత్మ గౌరవానికి, భద్రమైన భవిష్యత్తుకు ప్రతీకని పొంగులేటి అన్నారు. ముఖ్యమంత్రి రేవంతరెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల మంజూరును నిరంతరం కొనసాగించే ప్రక్రియగా చేపట్టిందన్నారు.
రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన ఇన్‌చార్జి మంత్రులు, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వివిధ శాఖ అధికారులతో శుక్రవారం హౌజింగ్ కార్యాలయంలో మంత్రి పొంగులేటి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మొదటి విడతలో 3 లక్షలకు పైగా ఇండ్లను మంజూరు చేయగా, దాదాపు 2.90 లక్షల వరకు గ్రౌండింగ్ కావడంతో పాటు 50 వేల గృహ ప్రవేశాలు జరిగాయన్నారు. రెండు లక్షలకు పైగా ఇండ్ల నిర్మాణం పనులు వివిధ దశల్లో ఉన్నాయని మరో రెండు నెలల్లో పూర్తి అవుతాయని మంత్రి తెలిపారు. జూన్ 2న ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత ఇండ్ల మంజూరు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.
అర్హులైన ప్రతి లబ్ధిదారునికి మూడవ, నాలుగవ విడతలుగా ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందన్నారు. పేదవాడు తాను నివసిస్తున్న గుడిసె స్థానంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటే తమ ల్యాండ్ అంటూ ఫారెస్ట్ అధికారులు గానీ, సింగరేణి యాజమాన్యం కానీ అడ్డుపడొద్దని చెప్పారు. ఇండ్ల బేస్ మెంట్ కోసం చెరువులు, కుంటల నుంచి మట్టిని తరలిస్తే రెవెన్యూ, పోలీసు అడ్డు చెప్పకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు.
డబుల్ బెడ్ రూం కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలైన విద్యుత్, మంచినీరు, డ్రైనేజి వంటి వాటి పనులను వెంటనే పూర్తి చేయాలని, నిర్మాణంలో ఉన్న కాలనీల్లో టవర్‌ను యూనిట్ గా తీసుకుని లబ్ధిదారుల అసోసియేషన్ ల ద్వారా పనులు వేగవంతం అయ్యేలా చూడాలని మంత్రి ఆదేశించారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఎక్కువ మొత్తంలో అటవీభూములున్నాయని, రెవెన్యూ, ఫారెస్ట్ విభాగాల మధ్య చాలా సరిహద్దు వివాదాలను పరిష్కరించేందుకు జాయింట్ సర్వే నిర్వహించాలన్నారు. మంత్రులు వాకిటి శ్రీహరి, సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.






