13-02-2026 12:13:46 AM
రంగారెడ్డి, ఫిబ్రవరి 12(విజయక్రాంతి): జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపును పురస్కరించుకుని ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ జి. సుధీర్ బాబు, ఐపీఎస్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
(BNSS) సెక్షన్ 163 ప్రకారం కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిషే ధాజ్ఞలు విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ఆంక్షలు ఫిబ్రవరి 13, 2026 (శుక్రవారం) ఉదయం 6:00 గంటల నుండి రాత్రి 11:00 గంటల వరకు అమల్లో ఉంటాయని చెప్పారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల చుట్టూ 500 మీటర్ల వరకు ఈ నిషేధాజ్ఞలు వర్తిస్తాయన్నారు. కౌంటింగ్ కేంద్రాల సమీపంలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటంపై పూర్తి నిషేధం విధించారు.
ఆమనగల్, ఇబ్రహీంపట్నం, షాద్నగర్, శంకర్పల్లి, మొయినాబాద్, చేవెళ్ల మున్సిపాలిటీలో ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. ఎన్నికల ఫలితాల అనంత రం ఉద్వేగాలకు లోనవ్వకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని కమిషనర్ సూచించారు. నిబంధనలను ఉల్లంఘించి అశాంతికి దారితీసే పనులు చేసే వారిపై, గుంపులుగా ఏర్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలందరూ పోలీసు యంత్రాంగానికి సహకరించి, శాంతిభద్రతలను కాపాడాలని కోరారు.