14-07-2025 01:50:07 AM
పనులను తనిఖీ చేసిన కొత్త జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ
హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): వచ్చే ఏడాది మొదట్లోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ చెప్పారు. ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో అధికారులు పనులు వేగంగా జరిగేలా కృషి చేస్తున్నారని తెలిపారు.
ఆదివారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులను తనిఖీ చేసి చేశారు. ప్లాట్‌ఫారమ్ నెం.1, నెం.10 వైపు జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రత్యేకించి ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు, స్టేషన్ బుకింగ్ కౌంటర్లు, పార్కింగ్, సర్క్యులేటింగ్ ఏరియాల్లో చేపడుతున్న అభివృద్ధి చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పునర్నిర్మాణ ప్రణాళికలు, పురోగతిపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా జీఎంకు అధికారులు వివరాలు అందించారు. ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్న విషయాన్ని, భద్రతా పటిష్టతపై చేపడుతున్న చర్యలను కూడా వివరించారు. పునర్నిర్మాణ పనుల నేపథ్యంలో భారీ మౌలిక వసతుల మార్పులు జరుగుతున్నాయని ఈ సందర్భంగా జీఎం తెలిపారు.
ప్రయాణికుల రద్దీ నిర్వహణ, భద్రతను మరింత బలోపేతం చేయడం, సహాయక చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. రూ. 720 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు పూర్తయితే ద.మ.రైల్వే పరిధిలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చి రైళ్ల రాకపోకలు మరింత సులభం అయ్యే అవకాశం ఉంది.