8 May, 2026 | 11:31 PM

సైబర్ సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యం

31-08-2024 03:50 AM
  1. సెక్యూరిటీ ఏజెన్సీలు లైసెన్సులు తీసుకోవాలి
  2. గ్రామీణ యువతకు ఉపాధి కల్పించాలి
  3. ఫిజికల్ సెక్యూరిటీ సమ్మిట్‌లో డిప్యూటీ సీఎం భట్టి
  4. సెక్యూరిటీ గార్డులకు కనీస వేతనం చెల్లించాలి: మంత్రి దుద్దిళ్ల

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): యాంటీ నార్కోటిక్ బ్యూరో, సైబర్ సెక్యూరిటీకి రాష్ర్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. భద్రత విషయంలో పోలీస్‌శాఖకు వారికి అవసరమైన మేరకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయిం చేందుకు రాష్ర్ట ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. శుక్రవారం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కార్యాలయంలో ఫిజికల్ సెక్యూరిటీ సమ్మిట్- 2024 డిప్యూటీ సీఎం ప్రారంభించగా.. సదస్సు ముగింపు వేడుకల్లో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు లైసెన్సులు తీసుకొని, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ప్రైవేటు సెక్యూరిటీ సంస్థలు, రాష్ర్ట పోలీసులు సంయుక్తంగా భద్రత విషయంలో దేశంలోనే తెలంగాణ రోల్ మెడల్ కావాలని ఆకాక్షించారు. ఫార్మల్‌తోపాటు ఇన్‌ఫార్మర్ పోలీసింగ్‌పైనా దృష్టి పెట్టిన పోలీసు ఉన్నతాధికారులను డిప్యూ టీ సీఎం అభినందించారు. ప్రైవేటు సెక్యూరిటీ ఇండస్ట్రీ అనేది ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగమని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ భద్రతను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందోని చెప్పారు.

రాష్ర్ట ప్రభుత్వం అందిస్తున్న స్కిల్ డెవలప్మెంట్, ప్రైవేటు సెక్యూరిటీ ఇండస్ట్రీ ద్వారా రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. సెక్యూరిటీ సిబ్బందికి దేశంలోనే అత్యుత్తమ వేతనాలు ఉండేలా రాష్ర్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల చట్టాన్ని సమర్థంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని భట్టి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం వేగంగా పెరుగుతున్నదని, సాఫ్టేవేర్, ఫార్మా ఇతర ప్రధాన పరిశ్రమలు వేగంగా విస్తరిస్తున్నాయని డిప్యూటీ సీఎం వివరించారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించామని పేర్కొన్నారు.

అత్యుత్తమ వ్యవస్థ అవసరం: దుద్దిళ్ల

ఐటీ రంగానికి అత్యుత్తమ సెక్యూరిటీ వ్యవస్థ అవసరమని మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు. రాష్ట్రం లోని సెక్యూరిటీ ఏజెన్సీలు మాజీ సైనికులు, పోలీసులు సిబ్బంది అధికారులతో నిర్వహిస్తున్నాయ న్నారు. కనీస వేతనాలు లేకపోవడంతో సెక్యూరిటీ గార్డులు ఎక్కువ కాలం పని చేసేందుకు ఆసక్తిని చూపడం లేదని తెలిపారు. అందుకే వారికి కనీస వేతనాలు చెల్లించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఇందుకు ప్రభుత్వం ఆదేశాల ఇచ్చే వరకు ఏజెన్సీలు చూసుకోవద్దని సూచించారు.

రాష్ట్రంలో 1500 సెక్యూరిటీ ఏజెన్సీలు ఉండగా.. కేవలం 500 మాత్రమే రిజిస్టర్ చేయించుకున్నాయని చెప్పారు. గ్రామీణ యువతకు ఉపాధి కల్పిం చడంలో సెక్యూరిటీ ఏజెన్సీల పాత్ర గొప్పదన్నారు. తెలంగాణ ఫిజికల్ సెక్యూరిటీ సమ్మిట్‌ను నిర్వహించడం ఇదే మొదటిసారి అని మంత్రి పేర్కొన్నారు. సెక్యూరిటీ ఏజెన్సీలు, హైదరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నా రు. ఇలాంటి సమ్మిట్లు మరిన్ని జరగాలన్నారు. సెక్యూరిటీ వ్యవస్థ గురించి విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించాలన్నారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్‌లో వారు పోలీసులు, సిబ్బంది పట్ల మర్యాదగా వ్యవహరిస్తారన్నారు.