2 July, 2026 | 1:17 AM

సీసీ కెమెరాలతో.. గ్రామాలకు భద్రత

02-07-2026 12:00 AM

అడిషనల్ డీసీపీ (ఎఆర్) సుభాష్ చంద్రబోస్

కోహెడ, జూలై 1: గ్రామాలలో సీసీ టీవీ, కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాల నియంత్రణ ఉంటుందని సిద్దిపేట అడిషన్ డిసీపీ (ఎఆర్ ) సుభాష్ చంద్రబోస్ అన్నారు. బుధవారం కోహెడ మండలం ఆరేపల్లి గ్రామంలో ‘సురక్ష నేత్ర‘ కార్యక్రమంలో భాగంగా సీసీటీవీ, 14 సీసీ కెమెరాలను ఘనంగా ప్రారంభించారు. 

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ప్రాముఖ్యత, డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, రోడ్డు భద్రతా నియమాల పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సురక్ష నేత్ర‘ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా  ఆయా గ్రామాల ప్రజల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటు కొనసాగుతుందన్నారు.  నేరాల నియంత్రణ, నిందితుల గుర్తింపు, శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు.

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే జిల్లా పోలీస్ శాఖ లక్ష్యమని, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. డ్రగ్స్ లేదా గంజాయి విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు టోల్ ఫ్రీ నెంబర్ 100 తెలియజేయాలని ప్రజలకు సూచించారు. అలాగే రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, అతివేగం, రాంగ్ రూట్ ప్రయాణాలను నివారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోహెడ ఎస్‌ఐ అభిలాష్ ఆరేపల్లి గ్రామ సర్పంచ్ చిట్యాల బాబు రాజు, ఉప సర్పంచ్ గొండ నర్సింగ రావు, పోరెడ్డిపల్లి సర్పంచ్ డబ్బేడ రజిత, విపిఓ మోహన్, గ్రామ పంచాయతీ సభ్యులు పాల్గొన్నారు.