అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టివేత
రూ. 58.08 లక్షల విలువైన బంగారం స్వాధీనం
రాజేంద్రనగర్, జూన్ 25 (విజయ క్రాంతి) : అక్రమంగా అబుదాబీ నుంచి నగరానికి బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని శంషాబాద్ ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 58.08 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్‌పోర్టులో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో శంషాబాద్ కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. బాడీ స్కాన్ నిర్వహించారు. నిందితుడు బంగారాన్ని శరీరంలోని మలద్వా రంలో కవర్‌తో చుట్టి తీసుకువచ్చినట్లు గుర్తించారు. దీంతో వెంటనే నిందితున్ని అదుపులోకి తీసుకొని అతని వద్ద ఉన్న బంగారాన్ని సీజ్ చేశారు. నిందితున్ని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గుట్కా ప్యాకెట్లు..
బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని జ్యోతినగర్‌లో మంగళవారం పోలీసులు గుట్కా స్థావరంపై దాడులు నిర్వహించారు. సీఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. దత్తు అనే వ్యక్తి ఓ స్థావరంలో గుట్కా నిల్వ చేస్తున్నారని సమాచారం అందుకుని పోలీసులు దాడులు నిర్వహించారు. రూ.8లక్షల విలువైన గుట్కా ప్కాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముగ్గురి అరెస్టు
హైదరాబాద్‌లో మంగళవారం పోలీసులు వేర్వేరు చోట్ల 14.1 కిలోల గంజాయిని పట్టుకున్నారు. మల్కాజిగిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మౌలాలీలో సిబ్బంది తనిఖీలు నిర్వహించి, ఒడిశాకు చెందిన బిజాయ్, రహీమ్ అనే వ్యక్తుల నుంచి రూ.5 లక్షల విలువైన 12.33కిలోల గంజాయిని స్వాధీ నం చేసుకున్నారు. మల్లాపూర్‌లో తనిఖీలు నిర్వహించి రూ.2 లక్షల విలువైన 1.56 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. శేర్‌లింగంపల్లిలో 121 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు.






