25 April, 2026 | 6:53 PM

మ‘నిషే’ మటాష్!

26-06-2024 02:02 AM
  1. మత్తుతో చిత్తవుతున్న జీవితాలు
  2. నిర్వీర్యం అవుతున్న యువత
  3. జరుగుతున్న దారుణాలెన్నో
  4. ఛిద్రమవుతున్న కుటుంబాలు అనేకం
  5. నేడు డ్రగ్స్ వినియోగం, రవాణా వ్యతిరేక దినోత్సవం

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 25 (విజయక్రాంతి) : సమాజాన్ని పీడిస్తున్న సమస్యల్లో మాదక ద్రవ్యాల (డ్రగ్స్) వినియోగం ఒకటి.  వీటి మత్తు యువతను నిర్వీ ర్యం చేస్తోంది. అనుకోని పరిస్థితుల్లో డ్రగ్స్‌కు అలవాటుపడిన వారు ఎంతోమంది తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఓ వైపు పోలీసులు, ఎక్సైజ్ అధికా రులు, స్వచ్ఛంద సంస్థలు మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తు న్నా డ్రగ్స్ వ్యసనపరులు, బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది.

చిన్నాపెద్దా అనే తేడా లేకుండా డ్రగ్స్‌కు బానిసలు గా మారుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 27 కోట్ల మంది డ్రగ్స్ వినియోగదారులు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.  హైదరాబాద్ లాంటి నగరాల్లో వివిధ రకాల మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు ఎక్సైజ్, పోలీసు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ మత్తులో పడి పలువురు అత్యాచారాలు, హత్యలు, దొంగతనాలు సహా ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నా రు. డ్రగ్స్ శృతిమించి ప్రాణాలు హరిస్తున్నాయి. కుటుంబాలే ఛిద్రమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొనే మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో 1987 డిసెంబర్ 27న తీర్మానం చేసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ప్రతీ సంవత్సరం జూన్ 26ను ప్రపంచ మాదక ద్రవ్యాల (డ్రగ్స్), అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంగా జరుపుతున్నారు.  

పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం

మాదక ద్రవ్యాల వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ  వినియోగదారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తెలియక డ్రగ్స్‌కు అలవాటు పడుతున్న వారు కొందరైతే, అనర్ధాలు తెలిసీ పలువురు బానిసలుగా మారు తున్నారు. గతంలో గంజాయి, బంగ్ లాంటి స్వదేశీ మాదకద్రవ్యాలను వినియోగించే పలువురు ప్రస్తుతం విదేశీ డ్రగ్స్‌కు అలవాటుపడుతున్నారు. పలువురు సెలబ్రిటీలు కూడా డ్రగ్స్ మత్తులో సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు. నగర పరిధిలోని దూల్ పేట్ సహా పలు ప్రాంతాల్లో గంజాయి సహా పలు రకాల విదేశీ డ్రగ్స్‌ను అనేక సందర్భా ల్లో పోలీసులు పట్టుకుంటున్నారు. పలు ఫాంహౌజ్‌ల్లో డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నాయనే ఉన్నాయి. ఈజీ మనీ కోసం పలు వురు డ్రగ్స్ రవాణాను ఎంచుకుంటున్నారు. 

రవాణా జరుగుతోందిలా.. 

గంజాయి, బంగ్ లాంటి మత్తు పదార్థాలను ఒరిస్సా, బీహార్, ఏపీ సహా రాష్ట్రంలోని పలు మారుమూల ప్రాంతాల నుంచి రవా ణా సాగుతోంది. ఎల్‌డీఎస్, హషీష్, చరస్, కొకైన్, హెరాయిన్, హశీల్ ఆయిల్, ఓపీఎం, ఎండీఎంఏ, ఎల్‌సీడీ అనే డ్రగ్స్ అక్రమంగా విదేశాల నుంచి గోవా, బెంగుళూరు మీదు గా హైదరాబాద్ నగరానికి చేరుకుంటోంది. ఈ సంవత్సరం 1.25 కిలోల హషీష్, 117.2గ్రాముల చరస్, 6కిలోల ఓపీఎం, 384.4గ్రాముల ఎండీఎంఏ, 80గ్రాముల హెరాయిన్, దాదాపు 30క్వింటాళ్ల గంజా యి వివిధ దాడుల్లో పట్టుబడింది. ఆయా కేసుల్లో 735మంది అరెస్ట్ అయ్యారు. 500కు పైగా కేసులను నమోదైనట్లు పోలీస్ రికార్డులు తేటతెల్లం చేస్తున్నాయి. 

డ్రగ్స్ వల్ల నష్టాలు

డ్రగ్స్ తీసుకోవడం వల్ల అనేక అనార్థాలు కలుగుతాయని ఆరోగ్య నిఫుణులు హెచ్చరిస్తున్నారు. రోగనిరోధక శక్తి బాగా దెబ్బతింటుంది. జీర్ణవ్యవస్థ సరిగా పని చేయదు.  గుండె, కాలేయం, రక్తనాళాలు, ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుంది. జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. ఏకాగ్రత లోపిస్తుంది. మెదడు దెబ్బతిని పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది.

డ్రగ్స్ నిర్మూలనకు చర్యలు 

రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నాం. డ్రగ్స్‌ను అరికట్టడానికి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహిస్తున్నాం. వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలకు జరుగుతున్న డ్రగ్స్ రవాణాపై నిఘా ఉంచి పని చేస్తున్నాం. డ్రగ్స్‌ను అరికట్టడానికి ప్రజలు కూడా సహకరించాలి.

 వీబీ కమలాసన్‌రెడ్డి, ఎక్సైజ్ 

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్