14-01-2026 12:00:00 AM
ఆత్మవాంస్త్వల్పదేశోపి
యుక్తః ప్రకృతి సంపదా,
నయజ్ఞః పృథివీం కృత్స్నాం
జయత్యేవ నహీయతే!
(కౌటిలీయం- 6
ఆత్మవంతుడు (సద్గుణవంతుడు), నీతిశాస్త్ర పారంగతుడునైన పాలకుడు, చిన్న దేశానికి అధిపతియైనా, ప్రకృ తుల సంపదతో (అమాత్య, జనపద, దుర్గ, కోశ, సైన్య, మిత్ర సంపద) కూడిన వాడైతే సమస్త భూమిని జయించి తీరుతాడు, ఎప్పటికీ నశించడు. అలా కానినాడు, పెద్ద సా మ్రాజ్యానికి అధిపతియైనా నశిస్తాడు లేదా శత్రువులకు వశుడౌతాడు అంటాడు, ఆచా ర్య చాణక్య. ప్రకృతములైన అనగా తమ తమ విధులను చక్కగా నిర్వహించేవారిగా భావించాలి. ఆత్మవంతుడు అనడంలో విజ య సాధనా కాంక్ష తో నిరంతరం కృషి చేసేవాడిగా భావించాలి.
అలాగే ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలియడం నీతి శాస్త్రాన్ని ఆకళింపు చేసుకోవడం. ఇతరుల విజయాన్ని చూస్తూ అడుగులు వేసే వ్యక్తి నడత అపజ యం వైపే సాగుతుంది. తన దృక్పథం నుం చి విజయాన్ని నిర్వచించుకొని ఆవైపు అడుగులు వేయడమే జీవిత ప్రయోజనాన్ని సిద్ధింపచేస్తుంది. పెద్ద సామ్రాజ్యానికి అధిపతియైనా, వనరులు అపారంగా కలిగినా పిరికితనాన్ని పొంది; పరిమితులను విధించుకుంటే.. తన అనుచరులను; విజయంవై పు నడిపించలేడు. రేపటి విజయాన్ని ఈనాడు దర్శిస్తేనే విజేతగా నిలుస్తారు.
దృఢమైన సంకల్పం..
పాలకులు విజయ సాధకులు కావాలి అంటే.. తనకు కావలసిన దానిపై స్పష్టత ఉం డాలి. అదే ఎందుకు కావాలో అవగాహన ఉండాలి. దానిని సాధించే సంకల్పం దృఢమైనదిగా ఉండాలి.. దానిని సాధించే అర్హతలను పెంచుకోవాలి. సంకల్పమూ సమకాలీ న సమాజానికి అద్దం పట్టాలి. కాలానికి ఎదురీది పోరాడాలని గానీ కాలంతో కొట్టుకుపోవాలని గానీ ఆలోచించడం సమంజ సం కాదు. నిరంతరం తెలియని విషయాన్ని తెలుసుకునే జిజ్ఞాస ఉండాలి. తెలిసిన విషయాన్ని విశ్లేషణ చేసుకోవాలి. కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకొని ఆచరణలో పెట్టాలి.
అనుచరుల్లో ఎవరి ప్రత్యేకతలు, నైపుణ్యాలు వారివే. ఎవరి లక్షణాలననుసరించి వారి పనితీరు ఉంటుంది. వారందరినీ ము ఖ్యంగా అమాత్యులు, ఉద్యోగులు, మిత్రులను ప్రభావవంతంగా సమన్వయం చేయగ లగాలి. అవసరమైన చోట పట్టువిడుపులను ప్రదర్శించాలి. అందుబాటులో ఉన్న వనరులను సమర్ధవంతంగా వినియోగించుకోవా లి. అత్యంత రహస్యమైన గూఢచర్య వ్యవస్థను ఏర్పరచాలి. తన రహస్యాలను కాపా డుకోవాలి.. ఎదుటివారి రహస్యాలను తెలుసుకోవాలి. అనుచరుల వ్యక్తిత్వాన్ని ఎప్పటిక ప్పుడు గమనించాలి.
విజయం అంటే ఏమిటి?
కొందరు డబ్బు సంపాదించడం.. కొం దరు ఆత్మీయులను సంపాదించడం, మరికొందరిరు నిద్రాహారాలు మాని కొత్త విషయాన్ని కనుగొనడం విజయంగా భావిస్తా రు. ఇలా విజయానికి ఒక్కొక్కరు వారి దృష్టికోణంలో ఒక్కొక్క నిర్వచనం చెప్పుకున్నా ‘ఉన్నస్థితి నుంచి సంతృప్తితో కూడిన ఉన్నత స్థితిని చేరడం’ విజయంగా చెప్పుకోవచ్చు. అయితే ఉన్నత స్థానానికి చేరాలనుకున్నప్పుడు ఉన్న స్థానాన్ని చూచి భయపడకూ డదు. అందనంత ఎత్తుపై అమృత ఫలాలు ఉంటే.. చెట్టెక్కే ప్రయత్నమే ఫలితాన్ని అందిస్తుంది. పనిని కర్తవ్యంగా నిర్వహించే వారు కొందరైతే దానిని ఆనందంగా నిర్వహించేవారు మరికొందరు. ఇద్దరూ కార్యాన్ని నిబద్ధతతో పూర్తి శక్తిసామర్ధ్యాలను వినియోగించి నిర్వహించినా అందులో ఆస్వాదించే ఆనందం వేరువేరుగా ఉంటుంది.
ఎవరైతే కర్తవ్యాన్ని ఆనందంగా నిర్వహిస్తారో వారి విజయం సార్ధకమైనదిగా భావించవచ్చు. అవసరాలు వేరు కోరికలు వేరు. అవసరాలు విత్తనాల లాంటివి కాగా.. కోరికలు కలుపు మొక్కల లాంటివి. కలుపు మొక్కలు పీకివేస్తే విత్తనాలు ఫలితాన్నిస్తాయి. ఉన్నతస్థితికి చేరడం అభ్యుదయం. తన అవసరాలకు మించిన సంపద తనవద్ద ఉన్నదనే భా వన లేదా సం తృప్తియే అభ్యుదయం. విజయసాధనలో ఎన్నో మజిలీలు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవకాశాలు ఎదురవుతుంటాయి. వాటిని సమన్వయ పరుచుకుంటూ అనుచరులకు ప్రోత్సాహాన్నిస్తూ, తన వెంట నడిపిస్తూ ముందుకు సాగే నాయకుడు విజయ సాధకుడౌతాడు.
తప్పులు సహజం..
ఆ ప్రయాణంలో తప్పులు చేయడం మా నవ సహజం. జరిగిన తప్పిదాలకు ఆత్మన్యూనతకు లోనుకాకుండా ఆ తప్పులను సరిదిద్దుకుంటూ ఆత్మ విమర్శతో ముందు కు సాగాలి. జరిగిన తప్పును ఎవరూ గుర్తించకపోయినా తానుగా గుర్తించి సరిచేసుకునే మానసిక స్థితియే ఆత్మవిమర్శ. అలాంటి వ్యక్తులే ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. సా ధించిన విజయం ఆత్మవిశ్వాసాన్నివ్వాలి. అ యితే ఆత్మ విశ్వాసం అహంభావానికి చోటివ్వకూడదు. ఆత్మన్యూనత స్వేఛ్ఛాయుత ఆ లోచనలకు అవరోధాలను కల్పిస్తుంది. నిరా శ, అసూయ దానికి వత్తాసు పలుకుతాయి. బాహిరమైన బలహీనతలు అంతర్గత బలహీనతలకు ఊతమిస్తాయి.
వాటిని బలాలుగా మార్చుకోగలిగితే చేస్తున్న పనిలో వికా సం కలుగుతుంది. వికాసం విస్తరణకు దారిచూపితే విభవం కలుగుతుంది. విభవం తదుపరి కలిగేది విజయం. అనేక నెలల కష్టం తదుపరి ఒక శాస్త్రవేత్త ప్రపంచానికి ఉపకరించే ఒక ప్రయోగం నిర్విఘ్నంగా నిర్వహించగలగడం విభవానికొక ఉదాహరణ. విభవం పెంచుకోవడానికి, పంచుకోవడానికి ప్రేరణనిస్తూ సంతృప్తినివ్వాలి. సంతృప్తి తో కూడిన విభవాన్నే విజయంగా చెప్పుకోవచ్చు. అలా ప్రేరణనివ్వని విజయాన్ని నిరర్ధక విజయంగా చెబుతారు. మహాభారతం లో, తన వారందరినీ కోల్పోయి పాండవు లు సాధించిన విజయం నిరర్ధక విజ యంగా చెప్పుకోవచ్చు.
నిబద్ధత అవసరం..
విజయ సాధనలో నిబద్ధత, సమర్ధత, స్థిరత్వం ప్రధాన భూమికను పోషిస్తాయి. నిబద్ధత అంకిత భావనతో లక్ష్యానికి చేరేందుకు ఉపకరించే సాధనం. దీనినొక భవం తికి అవసరమైన పునాదిగా చెప్పుకోవచ్చు. ఏ పనిని తలపెట్టినా నైపుణ్యంతో నిర్వహించడం సమర్ధత. దీనిని భవంతికి స్తంభంగా చెప్పుకోవచ్చు. లక్ష్యం వైపు ఉన్నత పథంలో వేసే చిన్న చిన్న అడుగులు, నిరంతర ప్రయత్నమే స్థిరత్వం. నిబద్ధత లక్ష్యంపై దృష్టిని కేంద్రీకరించేందుకు ఉపకరించగా, సమర్ధత ప్రతిభావంతంగా లక్ష్యాలను సాధించడానికి ఉపకరిస్తుంది. నిబద్ధత క్రమశిక్షణను పట్టుదలను పెంచగా, సమర్ధత ఆత్మవిశ్వాసాన్ని, గుర్తింపును పెంచుతుంది. రెండింటిని సమన్వయం చేసుకోవడం వల్ల ఉత్సాహంతో కొత్త అవకాశాలను అన్వేషిస్తాము.
ఉత్పాదకత పెరగడంతో పాటు అభ్యుదయం సాకా రమౌతుంది. ఒకవిధంగా వాహనానికి సమర్ధత ఇంజన్ అనుకుంటే నిబద్ధత పెట్రో ల్ అనుకోవచ్చు. లక్ష్యం వైపు తీసుకువెళ్ళే సమయంలో స్థిరత్వం లేదా నిలకడ ఉంటే ఉన్న తి కలుగుతుంది. పట్టుదల, ప్రణాళిక, పరిశ్రమలు కార్యసాధనకు సానుకూల వాతావర ణాన్ని కలిగిస్తాయి.సానుకూల భా వనతో బాధ్యతను గుర్తిస్తూ, బాధ్యత వహించే వ్యక్తిలోని వివిధ సుగుణాలు, విలువలు కలిస్తే వ్యక్తిత్వం వ్యక్తిమత్వంగా రూపుదాలుస్తుంది. ఆత్మవిశ్వాసం ఆయుధంగా; పోరాటపటిమతో కూడిన వ్యక్తిమత్వమే విజయానికి దారిచూపుతుంది.
వ్యాసకర్త: పాలకుర్తి రామమూర్తి