14-01-2026 12:00:00 AM
పంజాబ్‌లో దళిత పోరాట ప్రవక్తగా అభివర్ణించే వ్యక్తి బాబు మంగు రామ్ ముగోవాలియా. మంగు రామ్ స్వాతంత్య్ర సమరయోధుడు, అద్ ధర్మ ఉద్యమ స్థాపకుడు. బ్రిటిష్ పాలనలో కుల అణచివేతకు గురైన వర్గాలకు స్వాభిమానం, హక్కులు, సమానత్వం కావాలనే లక్ష్యంతో ఉద్యమించారు. ఆది ధర్మ్ ఉద్యమం ద్వారా దళితుల్లో ఆత్మగౌరవాన్ని నింపారు. మంగురాం 1886 జనవరి 14 పంజాబ్‌లోని ముగోవాల్ గ్రామంలో జన్మించారు. చమర్ కులానికి చెందిన మంగు రామ్ ఆమెరికాలో గదర్ పార్టీ ఉద్యమంలో పాల్గొని, దేశానికి తిరిగి వచ్చి దళితుల సామాజిక, రాజకీయ చైతన్యం కోసం కృషి చేశారు. భారతదేశంలో అగ్రకుల హిందువుల’ ఆధిపత్యంలో దళితులు విస్మరించబడ్డారు.
అంటరానితనం, అస్పృశ్య తతో వెలివేయబడ్డారు. బాబు మంగు రామ్ ముగోవాలియా అమెరికా ఉదారవాద ఆలోచనలు ఆయనను కుల వ్యవస్థలో సామాజిక వివక్షకు వ్యతి రేకంగా తిరుగుబాటు చేసేలా చేసింది. ఈ క్రమంలో ఆయన 1920లో పంజాబ్‌లో ‘అద్ ధర్మ్ మండల్ స్థాపించి, దళితులను ‘మూల నివాసులు’గా గుర్తించి, వారికి ప్రత్యేక మతం (అద్ ధర్మ్) పేరు సూచించారు. అద్ ధర్మ్ ఉద్యమం దళితు ల సాంసృ్కతిక పునరుజ్జీవనం, ఆ ధ్యాత్మిక పునరుద్ధరణ, రాజకీయ చైతన్యంపై దృష్టి సారించింది. భూమి, -నీటి, -ఆలయ హక్కుల కోసం గ్రామ సమావేశాలు నిర్వహించారు.
‘అద్ ధర్మ నాయకులు సనాతన హిందూ మతంలో దళితులను అపవిత్రులుగా చూడటా న్ని ఖండించారు. ఈ మతం నుంచి వేరు చేసి, వారి సొంత పురాతన మతం అద్ ధర్మ్‌లో ఏకీకృతం చేయడం లక్ష్యంగా ఉద్యమాన్ని నడిపారు. తద్వారా గౌరవం, స్వేచ్ఛను, ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించారు. హోషియార్‌పూర్‌లో తన బహిరంగ ప్రసంగాల్లో అద్-ధర్మ ఉద్యమం గురించి వివరించి మంగు రామ్ ఆలోచనను కాన్షీరాం ముందుకు తీసుకువెళ్లారు. ఆద్ ధర్మ ఉద్యమం ఆనాటి సనాతన హిందూ మతానికి వ్యతిరేకంగా సాగిన తిరుగుబాటు ఉద్యమం. మనువాద కట్టుబాట్లకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం. 1931 జనాభా లెక్కల్లో అద్ ధర్మ్‌ను ప్రత్యేక మతంగా రాయాలని డిమాండ్ చేశారు. ఈ ఉద్యమం దళిత చైతన్యంలో కీలక పాత్ర పోషించింది. వారంతా అంబేడ్కర్ ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. 1937 ఎన్నికల్లో అద్ ధర్మ పార్టీ ఏడు సీట్లు గెలిచి బహుజన రాజకీయాలకు పునాది వేసింది.
బాబు మంగు రామ్ ముగోవాలియా కులరహిత సమాజాన్ని స్థాపించాలని తన జీవితకాలం కృషి చేశారు. నేటికి భారతదేశంలో బహుజనులు కుల వివక్ష, సామాజిక, ఆర్ధిక, రాజకీయ వివక్షతకు గురవుతున్న నేపథ్యంలో అద్ ధర్మ్ లాంటి స్వీయ-గుర్తింపు ఉద్యమం ఇప్పటికీ అవసరముంది. అన్యాయానికి ఎదురొడ్డి నిలబడాలంటే ధైర్యం, ఐక్యత, అవగాహన అవసర అని చెప్పి హక్కుల కోసం శాంతియుతంగా పోరాడాలని చెప్పిన మంగు రామ్ ముగోవాలియా జీవితం మనకు ఒక గొప్ప పాఠం. తప్పుడు చరిత్రల వల్ల ఉద్ధం సింగ్, ఝల్కారీ బాయి వంటి ఎస్సీ, ఎస్టీ, బీసీల పరాక్రమం, ఉద్యమాన్ని చరిత్ర పుస్తకాల్లో లిఖించలేదు. మంగు రామ్, ఉద్ధం సింగ్ వంటి దళితుల చరిత్రపై వివక్షత కారణంగా దళిత, బహుజనుల త్యాగాలు, అస్తిత్వ పోరాటాలు మనకు తెలియకుండానే మరుగున పడిపోయాయి.
సంపతి రమేష్ మహారాజ్, 7989579428