calender_icon.png 28 October, 2025 | 10:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టు నేత బండి ప్రకాష్ లొంగుబాటు

28-10-2025 08:02:20 PM

మందమర్రి,(విజయక్రాంతి): మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, మావోయిస్టు అనుబంధ సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) నాయకుడు బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ మంగళవారం హైదరాబాద్ లో రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, నేషనల్ పార్క్ ఏరియా ఆర్గనైజర్‌గా కీలక బాధ్యతలు నిర్వహించిన ప్రకాష్ సుమారు 45 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు.కగార్ ఆపరేషన్ కు తోడు దండకారణ్యంలో ఉద్యమo బలహీనపడగా, 45 ఏళ్ల సుదీర్ఘ పోరుబాటను వీడి అనారోగ్య సమస్యలతో డీజీపీ సమక్షంలో లొంగిపోయారు.

బండి ప్రకాష్ ప్రస్థానం...

మావోయిస్టు నాయకుడు బండి ప్రకాష్ జిల్లాలోని మందమర్రి పట్టణానికి చెందిన సింగరేణి ఉద్యోగి అయిన బండి రామారావు, అమృతమ్మ ల రెండవ కుమారుడు. 1982 - 84 మధ్య అప్పటి పీపుల్స్ వార్ అనుబంద విద్యార్థి విభాగమైన రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యు) లో చురుకుగా పాల్గొని, సికాస ఆవిర్భావం తరువాత మిలిటెంట్ గా పనిచేశారు. 1984లో మందమర్రిలో జరిగిన ఏఐటియుసి నాయకుడు విటి అబ్రహం హత్య కేసులో అరెస్ట్ అయిన ప్రకాష్ ఆదిలాబాద్ సబ్ జైలుకు తరలించగా, అక్కడ నాటి పీపుల్స్‌వార్ ముఖ్య నేతలైన నల్లా ఆదిరెడ్డి, మహమ్మద్ హస్సేన్, ముంజ రత్నయ్య గౌడ్ లతో పరిచయం ఏర్పడి,  వారితో కలిసి ఆదిలాబాద్ సబ్ జైలు గోడలను బద్దలుకొట్టి, తుపాకులతో సహా చాకచక్యంగా తప్పించుకున్నారు.

అప్పట్లో ఈ ఘటన పెద్ద సంచలనం సృష్టించింది. ఆ తరువాత అంచలంచలుగా మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేరాడు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంతో 2004లో మావోయిస్టులు జరిపిన శాంతి చర్చల సమయంలో కీలకంగా వ్యవహరించారు. చర్చలు విఫలమైన అనంతరం వనం బాట పట్టారు. గత 20 ఏళ్లుగా బండి ప్రకాష్ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీలో అత్యంత కీలక పాత్ర పోషించారు. నేషనల్ పార్క్ ఏరియా ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, బస్తర్ దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ ఆర్గనైజర్ గా అత్యంత కీలక బాధ్యతలు నిర్వర్తించాడు.

సింగరేణి కార్మిక సమాఖ్య పేరుతో మావోయిస్టు అనుబంధ సంఘాన్ని అంచలంచెలుగా విస్తరించడం లో కీలక పాత్ర పోషించారు. ఇప్పటి వరకు అనేక ఎన్కౌంటర్ ల నుండి తృటిలో తప్పించుకున్నాడు. ప్రస్తుతం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, సికాస కార్యదర్శిగా, దండకారణ్యం ఆర్గనైజర్ గా పనిచేస్తున్న బండి ప్రకాష్ వయోభారం, దీనికి తోడు అనారోగ్య సమస్యల కారణంగా  లొంగిపోయినట్లు సమాచారం.  రాష్ట్ర డిజిపి ఎదుట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ మావోయిస్టు కీలక నేత బండి ప్రకాష్ లొంగి పోవడం చర్చనీయాంశమైంది.