భూదాన్ భూములకు ప్రత్యేక డిజిటల్ రికార్డులు ఏర్పాటు చేయాలి
- భూదాన యజ్ఞ బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలి
- అర్హులైన పేదలకు భూదాన భూములను పంచాలి
- తెలంగాణ సర్వోదయ మండలి అధ్యక్షులు ఆర్.శంకర్ నాయక్
ముషీరాబాద్, జూలై 12 (విజయక్రాం తి): రాష్ట్రంలోని భూదాన్ భూముల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి, జిల్లా, రెవెన్యూ డివిజన్, మండలం, గ్రామం, సర్వే నంబర్, విస్తీర్ణం, హద్దులు, ప్రస్తుత స్థితి, జియో-ట్యాగింగ్ తదితర వివరాలను నమో దు చేసి డిజిటలైజ్ చేసి ఆన్ లైన్ లో పెట్టాలని తెలంగాణ సర్వోదయ మండలి రాష్ట్ర అధ్యక్షులు ఆర్. శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ వివరాలను తెలంగాణ ఆన్ లైన్ భూ రికార్డుల్లో ప్రత్యేక ‘భూదాన్’ కేటగిరీగా నమోదు చేస్తే అక్రమ రిజిస్ట్రేషన్లు, ఆక్రమణలను సమర్థంగా అడ్డుకోవచ్చని తెలిపారు.
హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం నిర్వహించిన మండలి రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో భూదాన్ భూములపై ప్రత్యేక సర్వే నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. త్వరగా భూదా న్ యజ్ఞ బోర్డు ను ఏర్పాటు చేసి, అర్హులైన పేదలకు భూదాన్ భూములని పంపిణి చేయాలని ఆర్. శంకర్ నాయక్ కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ సర్వోదయ మండ లి, రంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాన్ని అధ్యక్షలుగా సాంబ మల్లేశం, ఉపాధ్యక్షులుగా దాసరి మల్లేష్, ప్రధాన కార్యదర్శిగా వి.బాలు నాయక్, సహాయ కార్యదర్శిగా ఎస్.కొండాలయ్య, కోశాధికారిగా పి. సూ ర్యం, ప్రతినిధిగా రఘు,
మహిళా విభాగం అధ్యక్షురాలుగా నాగజ్యోతి, ఉపాధ్యక్షురాలుగా ఏ. రాధా, యువజన విభాగం అధ్యక్షులు దయానంద్ కుమార్, కార్యదర్శిగా కె. శివ కుమార్‌లను ఎన్నుకున్నట్లు ఆర్. శంకర్ నాయక్ ప్రకటించారు. సమావేశంలో తెలంగాణ సర్వోదయ మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.గిరిప్రసాద్, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఎస్.యాదమ్మ, ఉపాధ్యక్షురాలు విజయ, యూత్ వింగ్ ప్రధాన కార్యదర్శి ఎస్.మహేష్ పాల్గొన్నారు.






