హత్యకేసులో ఏడుగురి అరెస్టు
- సముద్రాల కృష్ణ కేసు వివరాలను వెల్లడించిన ఎస్పీ
సూర్యాపేట, జూన్15(విజయక్రాంతి): అనుమానాస్పద మృతి కేసును నల్లగొండ జిల్లా పోలీసులు ఛేదించి, ఏడుగురిని అరెస్టు చేశారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రం లో ఎస్పీ చందనాదీప్తి వివరాలు వెల్లడించారు. మే 19న నల్లగొండ జిల్లా కనగల్ బ్రిడ్జి కింద మృతదేహం లభ్యమవగా.. మృతుడిగి యాదగిరిగుట్టకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సముద్రాల కృష్ణది గుర్తించామని తెలిపారు. కనగల్ పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.
కృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారి కావడంతో అతడికి బావ వరుసైన నాగబండి మధుకు రైస్‌పుల్లింగ్ ద్వారా ఆరు నెలల్లో రూ.100 కోట్లు ఇప్పిస్తానని నమ్మించి అతడి నుంచి రూ.కోటి 50 లక్షలు తీసుకున్నాడు. ఆరు నెలల గడిచినా రైస్‌పుల్లింగ్ ద్వారా ఇస్తానన్న డబ్బు ఇవ్వలేదు. తన డబ్బు తిరిగివ్వా లని మధు అడిగితే కృష్ణ నిరాకరించాడు. అయితే కృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి యాదగిరిగుట్టలో రెండు ఇళ్లు, పాట్లు, భువనగిరిలో ఒక ఇల్లు కొనుగోలు చేశాడు. తాను ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వనందుకు కృష్ణను హత్య చేసి, అతడి ఆస్తిని కాజేయాలని నాగబండి మధు పతకం వేశాడు. గుంటూరుకు చెందిన కమ్మ శ్రీనివాస్, తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన యల్లా కృష్ణ, సలాది మణికంఠ, ఇడపా హరికృష్ణ, గుంగూరుకు చెందిన ఉస్మాన్, షేక్ పాషాలతో కలసి కృష్ణ ను హత్య చేసేందుకు ప్లాన్ వేశారు.
గత నెల 9న కృష్ణ నర్సరీలో ఉండగా చంపేందుకు వెళ్లి అక్కడ పని మనిషి ఉండడంతో చంపకుండా వెళ్లారు. తిరిగి అదే నెల 16న ఇంట్లో కృష్ణ ఒక్కడే ఉండడంతో గమననించిన ఏడుగురు నిందితుల్లో ఐదుగురు కృష్ణపై దాడి చేశారు. గుడ్డతో ఊపిరి ఆడకుండా చేసి, నోటిలో సైనైడ్ పోసి హత్య చేశారు. కృష్ణ కారులోనే మృతదేహాన్ని తీసుకెళ్లి కనగల్ వద్ద వంతెన పైనుంచి పడేసి, కారుతో పాటు ఇంట్లో దొంగిలించిన సొమ్ముతో పరారయ్యారు. కారును హైద్రాబాద్‌లో అమ్మడానికి వెళ్తున్నట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో పోలీసులు దాడి చేసి ఏడుగురిని పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి రూ.11.45 లక్షల నగదు, 50 తులాల వెండి, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.






